మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు -రంగారెడ్డి, గౌ రవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి భూపేందర్ యా దవ్‌తో సిఎం రేవంత్, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యం లో ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశా రు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను వ్యయం చేసిందని వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని కేంద్రమంత్రికి సిఎం వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూలత నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు.