
4 సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్షం
సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత
రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలి
పాలమూరురంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టుకు అత్యున్నత ప్రాధాన్యం
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం వేగవంతం
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అంతర్‌రాష్ట్ర విభాగాన్ని బలోపేతం చేయాలి
అధికారులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి భవిష్యత్‌కు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యున్నత ప్రాధాన్య జాబితాలో ఉంచి, సాధ్యమైనంత వరకు ఆరు నెలల్లో ప్రాజెక్టుల వారీగా పర్యావరణ అనుమతులు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు న్యాయపరమైన స్పష్టతను కల్పించడంతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల సాధనకు కొత్త అవకాశాల ద్వారాలను తెరిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత చట్టబద్ధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతి అర్హమైన ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
పర్యావరణ అనుమతులు పొందిన ప్రాజెక్టులకు రక్షణ
సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సోమవారం రోజున రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపి బలరాం నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గతంలో చట్టబద్ధంగా పర్యావరణ అనుమతులు పొందిన ప్రాజెక్టులకు ఆ రక్షణ కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే పరిశీలనలో ఉన్న దరఖాస్తులను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను ప్రాజెక్టుల వారీగా సమగ్రంగా పరిశీలించి, సాంకేతిక, విధానపరమైన లోపాలను సరిదిద్దిన అనంతరం చట్టపరంగా అవకాశం ఉన్నచోట తిరిగి సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సుదూర ప్రభావం చూపగల ఈ తీర్పు వెలువడటం వెనుక తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు నిరంతరంగా సాగించిన న్యాయపోరాటం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
అంతర్రాష్ట్ర విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి
ఈ తీర్పులోని న్యాయసూత్రాలను లోతుగా అధ్యయనం చేసి, రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టుకు అవి ఏ విధంగా వర్తిస్తాయో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. అంతర్రాష్ట్ర విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి తెలంగాణ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగం అత్యంత కీలకమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆ విభాగాన్ని తగిన సాంకేతిక, పర్యావరణ, న్యాయ నిపుణులతో మరింత బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రిబ్యునల్- (ఎన్జీటీ), సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాలు, చట్టబద్ధ సంస్థల ముందు తెలంగాణ వాదనను శాస్త్రీయ ఆధారాలు, సమగ్ర పత్రాలతో బలంగా వినిపించే సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర అధికారుల వద్ద అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అసలు పర్యావరణ అనుమతులు, ఆ తర్వాత ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న మార్పులు, రీడిజైన్, విస్తరణ, ప్రాజెక్టు ప్రాంత మార్పు, పెండింగ్ దరఖాస్తులు, న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు, పాటించాల్సిన నిబంధనలు, జరిమానాలు ఉంటే వాటి వివరాలతో పాటు ప్రతి అంశాన్ని ఒకే సమగ్ర దస్త్రంలో పొందుపరచాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
ఏడు రోజుల నుంచి ఆరు నెలల వరకు స్పష్టమైన కార్యాచరణ
ఏడు రోజుల నుంచి ఆరు నెలల వరకు స్పష్టమైన కార్యాచరణ పర్యావరణ అనుమతుల సాధనకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దశల వారీ కార్యాచరణను నిర్దేశించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులను ఏడు రోజుల్లో సమీకరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. నవీకరించిన పర్యావరణ అధ్యయనాలు, నిబంధనల అమలు నివేదికలు, భూ రికార్డులు, న్యాయపరమైన పత్రాలు, ఇతర అవసరమైన దస్త్రాలను 30 రోజుల్లో సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన పరిపాలనా ప్రక్రియతోపాటు దరఖాస్తుల తయారీ, పరిశీలన, సమర్పణకు సంబంధించిన దశలను 60 రోజుల్లో పూర్తిచేయాలని మంత్రి సూచించారు. చట్టబద్ధ విధానాలు, సంబంధిత సంస్థల పరిశీలనకు లోబడి సాధ్యమైన ప్రతి ప్రాజెక్టుకు ఆరు నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని, ప్రతి నెలా ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
గౌరవెల్లి పంప్‌హౌస్‌ను సర్వసన్నద్ధంగా ఉంచాలి
గౌరవెల్లి పంప్‌హౌస్‌ను సర్వసన్నద్ధంగా ఉంచాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో నిర్వహణకు సిద్ధంగా ఉంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. పంపులను వినియోగంలోకి తీసుకొచ్చే సమయానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే తనిఖీలు, పరీక్షలు, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను- ఎస్‌ఓపీలను-కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువ వ్యవస్థలను ఇంజనీరింగ్ బృందాలు సమగ్రంగా పరిశీలించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
అనుమతి రాగానే సీతారామ సాగర్ పనులు మొదలుపెట్టాలి
అనుమతి రాగానే సీతారామ సాగర్ పనులు మొదలుపెట్టాలని, సీతారామ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అధ్యయనాలు, పర్యావరణ పత్రాలను ఏమాత్రం ఆలస్యం లేకుండా నవీకరించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అనుమతి లేదా న్యాయపరమైన ఆమోదం లభించిన వెంటనే పనులను పునఃప్రారంభించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్యాకేజీలకు సంబంధించిన ఇంజనీరింగ్ ప్రణాళికలు, అంచనాలు, టెండర్ పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి అధికారులకు సూచించారు. అనుమతులు వచ్చిన తర్వాత మళ్లీ సన్నాహాల పేరుతో సమయం వృథా కాకూడదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలోనూ ఇదే స్థాయి అత్యవసరతతో వ్యవహారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారుల బృందం ఉండాలని, ఆ బృందం పత్రాల తయారీ, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం, దరఖాస్తుల పురోగతి, పెండింగ్ న్యాయ వ్యవహారాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసులకు సమన్వయ వ్యూహం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల విషయంలో రాష్ట్ర న్యాయ సలహాదారులు, అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులు, అధికారులు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఇంజనీర్- ఇన్-చీఫ్ (జనరల్) ఓవీ రమేష్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఇంజనీర్ -ఇన్-చీఫ్ (అడ్మిన్) పి.శ్రీనివాస్, ఇంజనీర్ -ఇన్-చీఫ్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఆర్.మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.











