మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున ప డ్డాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆం దోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ తీవ్రస్థాయి లో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటు న్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డి కి లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కెటిఆర్ డిమాం డ్ చేశారు.


లేకపోతే సిఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో ఎ ప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బిఆర్‌ఎస్ హయాంలో కొం డంత ధైర్యంతో బతికిన రైతులు కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కన్నీటి సేద్యంగా మార్చేసిందని ఆరోపించారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్థనాదాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేతకాని సర్కారు నిర్వాకం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలన చూసినా రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారని అన్నారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలుతున్నా కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే వారాల తరబడి పడిగాపులు కాస్తూ, గుండెపగిలి కుప్పకూలుతున్నా ప్రభుత్వానికి కనీస సోయి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడుకోవడానికి 70 సార్లు ఢిల్లీ చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధలో ఒక్క శాతం కూడా రైతులపై పెట్టడం లేదని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే పది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు

పెట్టుబడి సాయాన్ని వరుసగా నాలుగు సార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాల పాలుజేసినా రైతులు అన్నింటినీ దిగమింగి పండించిన ఏ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదని అన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పది మంది రైతులు వడదెబ్బకుతోడు సర్కారు చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోయారని, అయినా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదని అన్నారు. అందుకే రైతులు మరో మార్గం కనిపించక, ఇంతకాలం కంటిపాపలా పెంచుకున్న పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని రోడ్లపై కాలిబూడిదవుతున్న ధాన్యం కుప్పలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలు అని విమర్శించారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోకో జరగని రహదారి లేదని వ్యాఖ్యానించారు. ఈ 30 నెలల్లోనే సమైక్యరాష్ట్రం నాటి సకల కష్టాల్లో మళ్లీ రైతులను ముంచెత్తారని మండిపడ్డారు.

ఇన్నాళ్లు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చారని అన్నారు. కష్టాల్లో కొట్టమిట్టాడుతున్న తెలంగాణ రైతుల కన్నీళ్లతో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు నిండేలా ఉన్నాయని పేర్కొన్నారు. పగలూ రాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై రేవంత్‌రెడ్డికి కనీస పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారిందని విమర్శించారు. విలువైన భూములను తెగనమ్మి వేలకోట్లు దోచుకోవాలన్న ఉత్సాహం తప్ప రైతుల పంటలను కొనాలన్న ధ్యాస ముఖ్యమంత్రిలో ఏమాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు, మంత్రులు హెలికాప్టర్‌లో షికార్లు కొడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సిఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే, సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

60 లక్షల మంది రైతులకు సిఎం క్షమాపణలు చెప్పాలి

వరంగల్ నుంచి ఖమ్మం దాకా అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం ఒక్కటంటే ఒక్క లారీ లోడ్ కూడా ఎత్తడం లేదని కెటిఆర్ అన్నారు. అడపా దడపా చేసే కొనుగోళ్లలోనూ ఒక్కోచోట 10 కిలోలకు పైగా తరుగుతీస్తే ఇక రైతులకు మిగిలేదేంటో సిఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి గన్నీ బ్యాగు కోసం రైతులే 50 రూపాయల చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చినందుకు సిఎం, కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇచ్చే ముఖం సర్కారుకు ఎలాగూ లేదని ఇప్పటికే తేలిపోయిందని అన్నారు. చివరికి పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు అడుగడుగడునా పడిగాపులు పడుతుంటే వాటిని వదిలేసి, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలన్న సర్కారుకు ప్రాధాన్యతలే కాదు, చివరికి సోయి కూడా లేదని తేలిపోయిందని విమర్శించారు.

నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు

కెసిఆర్ హయాంలో మూడు నెల ముందు నుంచే పంటల కొనుగోలు ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేసే వారని గుర్తు చేశారు. గన్నీ బ్యాగుల నుంచి మొదలుకుని రైతుల ఖాతాల్లో పంట డబ్బులు సకాలంలో జమ అయ్యేదాకా నిరంతర సమీక్షలతో పర్యవేక్షించేవారని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రైతు కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకూ కొని రైతుల్లో అచెంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారని, అలా పండుగలా సాగిన వ్యవసాయంపై మీరు పగబట్టి రైతులకు చేసిన ద్రోహం అందరికీ అర్థమైపోయిందని అన్నారు. రైతులు తమ పంటకు నిప్పు పెట్టుకుంటున్నా మొద్దునిద్ర వీడని ముఖ్యమంత్రిని చూసి యావత్ రైతాంగం శాపనార్థాలు పెడుతోందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి తమ పంటను

కాపాడుకునేందుకు చివరికి టార్పాలిన్లు కూడా సమకూర్చలేని కాంగ్రెస్ సర్కారు ఉండి రైతులకు ఏం ప్రయోజనం..? అని నిలదీశారు. అనేక చోట్ల చెడగొట్టు వానలు పడి కళ్లముందే పంట కొట్టుకుపోతున్నా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. బిఆర్‌ఎస్ హయాంలో సంబురంగా సాగిన సాగును కష్టాల కడలిలో ముంచెత్తిన పాపానికి ఇప్పటికే వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆర్థనాదాలు ఏమాత్రం వినిపించుకునే తీరిక లేని సిఎం పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, వ్యవసాయాన్ని పాతాళంలోకి నెట్టిన పాలనపై ఇప్పటికే రైతుల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. 60 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు మరణశాసనం రాసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని కెటిఆర్ హెచ్చరించారు.