
ఆర్టీసీ సమ్మెపై నేడు కార్మికులతో మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ఈ మేరకు చర్చలు జరపాలని సిఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు. నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల బృందం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సమ్మెపై ప్రధానంగా చర్చ జరిగింది. నర్సంపేట, నల్గొండ ఘటనల నేపథ్యంలో ఆర్టీసి కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా నేడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఆర్టీసి కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని ఆదేశించినట్టు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.











