
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ నేతలను దూషించేందుకు ఒక రోజంతా సభ పెట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు. మిగిలిన వారం రోజులైనా ప్రజా సమస్యలపై మాట్లాడుదామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆరుగ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైందని, హామీలు అమలు చేయక.. అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయని విమర్శించారు. దళిత స్పీకర్ అని సిఎం రేవంత్ రెడ్డి ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ హామీలు, ఆరు గ్యారెంటీలపై సభలో చర్చిద్దామని, దళితులపై ప్రేమ ఉంటే డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి 12 పైసలు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సి,ఎస్టిలకు 30 శాతం వాటా ఇస్తామన్నహామీ ఏమైంది? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డికి తప్ప ఎస్సి,ఎస్టిలకు కాంట్రాక్టులు ఇచ్చారా?అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఎన్ని రకాలుగా పరిహాసమవుతుందో ప్రజలు గమనిస్తున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.








