
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక అధికారిని ఎ క్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారం అని, దానిని ఎవరూ గుంజుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానాల మీద తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని తెలిపారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, త మ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా అని సిఎం అన్నారు. హైడ్రా అత్యుత్తమ సంస్థల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హై డ్రా విధి అని, ఆ పనిని హైడ్రా పకడ్బందీగా చే స్తోందని తెలిపారు. చెరువులు, నాలాలు, కుంట లు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్నోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్‌కుమార్ మీద 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని సిఎం ప్రశ్నించారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సిఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ కుంటలాంటి దానిని బిఆర్‌ఎస్ వాళ్లు కబ్జా పెట్టుకున్నారని, దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారని సిఎం విమర్శించారు.
ఆ కుంట పేరే బతుకమ్మ కుంట అని, దానిపై కేసు నడుస్తోందని, వాటిని ఏవిధంగా చూడాలని ప్రశ్నించారు. హైడ్రాని పనిచేయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోరులకు సహకరించవద్దని సిఎం మీడియాకు విజ్ఞప్తి చేశారు.హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిందని,అది పేదోళ్లదా..గండిపేట చెరువులో ఆక్రమణలు కూలగొట్టింది.. అవి పేదోళ్లవా.. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నోళ్లు పేదోళ్లా..? అంటూ సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కబ్జాదారులను కాపాడటానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా కార్యాచరణపైనా, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతలపైనా ప్రభుత్వానికి స్పష్టత ఉందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని సిఎం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామని, అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.











