
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య “మెలోడీ” సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాకు షేక్ చేస్తుంది. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా, ఆయన మెలోనికి మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోతోపాటు మోడీతో మెలోని తీసుకున్న సెల్ఫీ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
మెలోడీ ట్రెండింగ్ లో ఉండటంతో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు గురువారం వరుసగా రెండో సెషన్‌లో పెరిగాయి. పార్లే పేరుతో ముడిపడి ఉన్న స్టాక్‌ల పట్ల రిటైల్ పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి. దీంతో పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో ఉదయం 10:03 గంటల సమయానికి పార్లే ఇండస్ట్రీస్ షేర్లు 4.95% పెరిగి ఒక్కో షేరు రూ. 5.51కి చేరాయి. అయితే, మెలోడీ, పార్లేకి సంబంధమే లేదు. పార్లే ప్రొడక్స్ అనే సంస్థ.. మెలోడి, పార్లేజి, క్రాక్ జాక్, మోనాకో వంటి బ్రాండ్ లను తయారు చేస్తోంది. ఈ సంస్థ స్టాక్ మార్కెట్ లో అసలు లిస్టే కాలేదు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ అనేది వేరే సంస్థ. కానీ పేరులో పార్లే ఉండటంతో పెట్టుబడిదారులు పార్లే ఇండస్ట్రీస్ సంస్థ షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. దీంతో ఈ కంపెనీ షేర్లు అమాంతం పెరిగాయి.
మరోవైపు, మోడీ-మెలోని మెలోడి వీడియో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. గంటల్లోనే ఈ వీడియోకు సోషల్ మీడియాలో 12 కోట్ల వ్యూస్ వచ్చాయి.













