మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి

 ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరతాం

 పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో మావోయిస్టు మాజీ నేత దేవ్‌జీ

హైదరాబాద్: ప్రజా సమస్యలపై పనిచేసేందుకు వీలుగా సీపీఐ(మావోయిస్టు)పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరే ఆలోచనలో ఉన్నట్టు లొంగిపోయిన మావోయిస్ట్ సీనియర్ నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తెలిపారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా, బహిరంగంగా పనిచేయాలని తాను, తనతోపాటు లొంగిపోయిన మావోయిస్టు సహచరులు భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీ (సీపీఐ మావోయిస్తు)పై నిషేధం ఎత్తివేయడంతో సహా ఈ అంశంపై అమిత్‌షాకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ‘పీటీఐ’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తిరుపతి (దేవ్‌జీ), ఇతర మావోయిస్టు నేతలు ఇటీవల తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. చిన్న చిన్న సమావేశాలు నిర్వహించడం, మరణించిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను కలవడం చేపట్టినప్పుడు పోలీసులు తమ కదలికలపై ఆంక్షలు విధించకుండా చూడాలని ఆయనను కోరారు. తమపై అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆయన అంగీకరిస్తూనే, తాము ఎలాంటి చట్టవిరుద్ధ, రహస్య, సాయుధ కార్యకలాపాలకు పాల్పడమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము పాత స్నేహితులను కలుసుకునే ప్రక్రియలో ఉన్నందున కొంతకాలం తర్వాత ప్రజాసమస్యలపై పనిచేయడం ప్రారంభిస్తామన్నారు. తమ అభ్యర్థనకు డీజీపీ సానుకూలంగా స్పందించారని తిరుపతి చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉండే సాధారణ రాజకీయ పార్టీ తరహాలో తాము చేపట్టబోయే కార్యక్రమాలు ఉండవని, అయితే ప్రజాసమస్యలపై పనిచేసే ఏ వేదిక అయినా రాజకీయ పార్టీగానే పరిగణించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నిషేధం ఎత్తివేసినప్పటికీ సీపీఐ (మావోయిస్టు) పేరుతోనే తాము పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నిషేధిత సంస్థ లో కీలక కమాండర్‌గా, వ్యూహకర్తగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉం టూ దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అజ్ఞాత జీవి తం గడిపిన తిరుపతి మరో సెంట్రల్ కమిటీ సభ్యు డు మల్లా రాజిరెడ్డితో కలిసి గత ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆ సమయంలో అనారోగ్య కారణాలతోనే తాను అజ్ఞా త జీవితం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే తాను విశ్వసించే సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసమస్యలపై చట్టబద్ధమైన మార్గంలో పనిచేస్తానని తెలిపారు.