విద్యార్థులతో రాహుల్ కార్యక్రమం కొనసాగింపు

యువత కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్

శుద్ధీకరణపై మోడీ క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు

న్యూఢిలీ : పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థలో లోపాలు, అయోధ్య రామమందిరానికి సంబంధించిన చందా చోరీ అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అలాగే ఉత్తరాఖండ్‌లో ఖర్గే కార్యక్రమం అనంతరం జరిగిన శుద్ధీకరణ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. 88 మంది నేతలు సమావేశానికి హాజరుకాగా, 33 మంది చర్చలో పాల్గొన్నారని తెలిపారు.

ప్రధానంగా మూడు, నాలుగు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. పేపర్ లీక్‌ల అంశంపై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, వాటిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపై చర్చించినట్లు వేణుగోపాల్ చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాలకు విజయవంతంగా సాగాయని, ప్రభుత్వం అనేక అంశాల్లో వెనుకబడిందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడిందన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నామని, వాటిలో కొన్నింటికి రాహుల్ గాంధీ స్వయంగా నాయకత్వం వహిస్తారని చెప్పారు.విద్య, పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్యా నిపుణులతో కలిసి పనిచేయాలని ఖర్గే సూచించినట్లు వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు నివేదికను తనకు సమర్పించాలని ఆయన ఆదేశించినట్లు చెప్పారు.

అయోధ్య రామమందిరానికి సంబంధించిన ‘చందా చోరీ’ అంశం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని, రామమందిరాన్ని ఉపయోగించుకుని ప్రజలను ధ్రువీకరించేందుకు ప్రయత్నించిన వారు ఇప్పుడు బహిర్గతమయ్యారని ఆరోపించారు. ఈ అంశాన్ని గ్రామ, పంచాయతీ స్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు (పీసీసీలు) ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబాట్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం లొంగుబాటు విధానం అనుసరిస్తోందని విమర్శించింది.

ఈ అంశంపై కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చ జరిగినట్లు వేణుగోపాల్ తెలిపారు. అదే సమయంలో లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్‌ను ప్రస్తుత 543 స్థానాల ప్రాతిపదికన అమలు చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ మరోసారి పునరుద్ఘాటించింది.ఉత్తరాఖండ్‌లో ఖర్గే కార్యక్రమం అనంతరం జరిగిన శుద్ధీకరణ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశానికి అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, పి. చిదంబరం తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక సిఎం డీకే శివకుమార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.