న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలే ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యమని, ప్రజల మధ్యకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ విజయాలను విసృ్తతంగా వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఎంపీలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి క్షణాన్ని అంకితం చేయాలని సూచించారు. మంగళవారం జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ, దేశమే మొదట అన్న భావనతో పనిచేయాలని ప్రధాని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. ప్రతి ఎంపీ తన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశ సంక్షేమానికి అంకితం చేయాలి. దేశ అభివృద్ధి, సుసంపన్నత కోసం నిరంతరం కృషి చేయాలని ప్రధాని సూచించారు అని తరుణ్ చుగ్ వెల్లడించారు.

భారత్ అంతర్జాతీయ వేదికపై మరింత ప్రభావాన్ని చూపుతోందని, భారత యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతోందని ప్రధాని సమావేశంలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ విధానం, సంక్షేమ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు భారత్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రధాని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంతో ఎన్డీఏ కార్యకర్తలు పనిచేస్తున్నారని తరుణ్ చుగ్ తెలిపారు.

బీజేపీ ఎంపీ శశాంక్ మణి త్రిపాఠి మాట్లాడుతూ.. దేశ సంక్షేమమే ప్రధాన అంశంగా ప్రధాని ప్రసంగించారని చెప్పారు. ప్రజలతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండాలని, ఆప్యాయంగా మమేకం కావాలని ఎంపీలకు సూచించారని తెలిపారు. యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, భారత్ సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని ప్రధాని వివరించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారితో ఆత్మీయంగా మెలగాలని సూచించారు అని త్రిపాఠి చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ నబిన్ నాయకత్వంలో తాము మరింత ఉత్సాహంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. వారి సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారానికి కృషి చేయడం ఎంపీల బాధ్యత అని ఆయన సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా, విజ్ఞాన శాస్త్రం, మౌలిక వసతుల రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రజలకు మరింత విసృ్తతంగా తెలియజేయాలని ప్రధాని సూచించారని కంగనా రనౌత్ వెల్లడించారు. హైడ్రోజన్ రైలు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం సాధించిన విజయాల గురించి కూడా ప్రజలకు వివరించాలి. ఈ విజయాలపై తగిన స్థాయిలో చర్చ జరగడం లేదనే ఆందోళనను ప్రధాని వ్యక్తం చేశారు అని ఆమె తెలిపారు.