
ఎన్నికల్లో గెలిచినవారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి వారితో ప్రమాణ స్వీకారం చేయించడం మన రాజ్యాంగ ప్రతినిధుల విధి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని రాష్ట్రపతి అధికారిక నివాసానికి వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కి వెళ్లి ఆయన చేత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత మంత్రుల, చట్ట సభ్యుల ప్రమాణాలు కూడా జరుగుతాయి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ లో ఉన్నదున్నట్లుగా చెప్పి ఈ ప్రమాణం చేయాలి. సాధారణంగా ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి భవన్ లేదా రాజ్‌భవన్‌కి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రులు పండిత నెహ్రూ మొదలు మన్‌మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో నాలుగు గోడల మధ్య తమ ప్రమాణాలు చేశారు. ఆ సంప్రదాయానికి భిన్నంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం మూడు సార్లు రాష్ట్రపతి భవన్ లో విశాలమైన ఫోర్ కోర్ట్ లో జరిగింది. వేల మంది అతిథులు, విదేశీ ఆహ్వానితులకు అక్కడ సౌకర్యవంతంగా ఉంటుందని వేదిక మార్చబడింది.
రాష్ట్రాల్లో కూడా తమ పదవీ స్వీకారం రంగ రంగ వైభవంగా జరగాలని కోరుకునేవారు భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మధ్య దేశంలో 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగి కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. పాండిచ్చేరిలో మళ్ళీ సిఎం పదవిని అందుకున్న ఎన్ రంగస్వామి గవర్నర్ నివాసంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా నలుగురు ముఖ్యమంత్రులు తమ రాజధానిలోని ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో తమ ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం మే 10 న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్‌డోర్ స్టేడియంలో జరిగింది. వివిధ క్రీడలకు కేంద్రమైన ఈ స్టేడియం లో 40 వేల మంది కూర్చునే సదుపాయం ఉంది. తమిళనాడులో ఒక ముఖ్యమంత్రి ఆ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి. మిగతా అందరూ రాజ్‌భవన్‌కు వెళ్ళినవారే. ప్రమాణ స్వీకారం మొదలు చేస్తూ ‘నేను’ అని గవర్నర్ అనగానే విజయ్ పిడికిలి బిగించి తమిళంలో తన సొంత శపథం ఆరంభించారు. మధ్యలో గవర్నర్ కలుగజేసుకొని ముందు ఈ పత్రాన్ని చదవమని సూచించారు. ఒక నటుడిగా అభిమానుల, యువత, కుటుంబ సభ్యుల ముందు ప్రమాణం చేయాలన్న సరదా అలా కట్టలు తెంచుకుంది. తన ప్రమాణ స్వీకార సభకు అయ్యే మొత్తం ఖర్చును తన పార్టీయే భరిస్తుందని విజయ్ అన్నారు. ఆ విషయం బయటికి రావాల్సిన అవసరం ఉంది. రూ. 620 కోట్ల ఆస్తికి వారసుడైన విజయ్‌కి ఈ భారీ ఉత్సవ ఖర్చు చిన్నదే అయినా పేదల పక్షాన పని చేస్తానన్న ఆయన ఆ డబ్బును కూడా పేదలకే వినియోగిస్తే చిత్తశుద్ధి తెలిసేది.
1983 లో ఎన్‌టి రామారావుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చింది. ఎల్‌బి స్టేడియంలో భారీ ప్రజా సందోహం మధ్య ఆయన తన స్టైల్లో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఈ ఉత్సవాన్ని చేపట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ఎల్‌బి స్టేడియం నే ఎంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు నాయుడు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి హంగామా లేకుండా రాజ్‌భవన్‌లోనే ప్రమాణాలు చేశారు. 2014లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్‌రావు కూడా రెండుమార్లు రాజ్‌భవన్‌లో మామూలు పద్ధతిలోనే తమ పదవిని చేపట్టడం గమనార్హం. రేవంత్‌రెడ్డి రాకతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం మళ్ళీ ఎల్‌బి స్టేడియంకి మారింది.
ఒక అధికారిక పద్ధతిలో జరగవలసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ బహిరంగ సభలా మారడం అవసరమా అనేది చర్చనీయాంశమే. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని లేదా గవర్నర్ ని తమ ఇష్టమైన చోటికి రప్పించడం ఎంతవరకు సబబు? ప్రమాణ స్వీకార ఉత్సవాలు నేతల ఇష్టానుసారంగా ఇలా వైభవంగా జరిగితే ఖర్చు తడిసి మోపెడౌతుంది. దీనిని ఎవరు భరిస్తారు అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. పత్రికా ప్రకటనలు, వేదిక ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్, సభికులకు సదుపాయాలు, భద్రత, అంబులెన్సులు, బయటి అతిథులకు, ఆహ్వానితులకు నివాస ఏర్పాట్లు.. ఇలాంటివి అన్ని కనీసంగా ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయక తప్పదు. మైదానం నిండా భారీ కటౌట్లు, ఊరంతా ఫ్లెక్సీలు, ప్రజల సేకరణ, భోజనాల ఏర్పాట్లు, వాహనాల కిరాయి ఇవన్నీ పార్టీ భరించాలి. ఈ లెక్కన ప్రభుత్వంపై కోట్లలో భారం పడక తప్పదు. పార్టీ పెట్టాల్సిన ఖర్చు ప్రభుత్వ ఖాతాలో పడకున్నా కూడా ఏదో రూపంలో అది కూడా ప్రజలపై పడే భారమే. 2022లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం ఖర్చు వివరాలు కావాలని స్థానిక సామాజిక కార్యకర్త ఆర్‌టిఐ ద్వారా వివరాలు సేకరించారు. సంబంధిత శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 20 నిమిషాల కార్యక్రమానికి రూ. 5 కోట్ల 59 లక్షలు ఖర్చుల అయ్యాయి. అందులో డెకరేషన్‌కే రూ. 1 కోటి 64 లక్షలు, 10 వేల మందికి భోజనాలకు రూ. 58 లక్షలు అయ్యాయట. దీని ఆధారంగా మన ముఖ్యమంత్రుల ప్రమాణాల హంగామా వల్ల ప్రభుత్వంపై, ప్రజలపై ఎంత భారం పడుతుందో ఊహించవచ్చు. రాబోయే ఎన్నికలకు ముందే ఈ దుబారాను అరికడతామని మన నేతలతో ప్రజలు ప్రమాణం చేయించవసిన అవసరం ఎంతో ఉంది.
బి.నర్సన్, 9440128169











