ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎపి ప్రభుత్వం హైదరాబాద్‌లో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన పార్టీ, ఎపి పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కు కవిత మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే మేధావి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.