
ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బిజెపికి షాక్ ఇచ్చారు. బిహార్‌లో కమలం పార్టీ కంచుకోటైన బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో అనూహ్య విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ఆయన బిజెపి అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 18,964 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బిజెపి జాతీయ అధ్యక్షడు నితిన్ నబీన్‌కు అడ్డాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత బిజెపి ఓటమిపాలైంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన నితిన్ నబీన్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే, ఆయన రాజ్యసభకు కూడా నామినేట్ కావడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి రావడంతో బాంకీపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో జులై 30న ఉప ఎన్నిక నిర్వహించగా.. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టగా బిజెపి కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయ బావుటా ఎగురవేశారు.











