
భారత్ ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పరం ప్రశంసించుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఆ ప్రశంసలు భారత్‌కు ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తున్నాయో పరిశీలిస్తే డొల్లతనమే కనిపిస్తుంది. అమెరికా సందు దొరికినప్పుడెల్లా భారత్‌కు ఏదో ఒక షాక్ కలిగిస్తూనే ఉంటోంది. ఇటీవల హర్మూజ్ జలసంధిలో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడి చేయడంతో భారతీయులైన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఫ్రాన్స్‌లోని జి7 సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకువచ్చారు.
పశ్చిమాసియా శాంతికి కృషిచేసిన ట్రంప్‌ను ఓవైపు ప్రశంసిస్తూ హర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత భారత్‌కు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ సముద్రమార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తున్నారని, నావికుల భద్రత తమకు చాలా కీలకమన్నారు. ఇరాన్‌తో చేసుకోబోయే ఒప్పందంలో నావికుల భద్రతకు భరోసా కల్పిస్తారని విశ్వసిస్తున్నట్టు ట్రంప్‌తో మోడీ అన్నారు. దీనికి ట్రంప్ నుంచి ముక్తసరి సమాధానమే లభించింది. భారత నావికుల మృతి తీరని నష్టమని, భారత్ నావికులపై దాడి జరిగితే తాము కాపాడతామని సర్ది చెప్పారు. మోడీ నాయకుడిగా ఉన్నంత కాలం భారత్‌ను కాపాడతామని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే జి7 సదస్సులో భాగంగా ట్రంప్ మోడీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న సమయంలోనే భారత్‌కు అమెరికా ఒక షాక్ ఇవ్వడం గమనార్హం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటి చెప్పిన అమెరికా ఇప్పుడు యుఎస్ సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించడం చర్చనీయాంశమవుతోంది. అమెరికాలో అత్యంత కీలక సైనిక విభాగాల్లో ఒకటైన ‘యుఎస్ పసిఫిక్ కమాండ్’ 1947 లో ఏర్పాటైంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత్ పశ్చిమ తీరం వరకు గత ఏడు దశాబ్దాలుగా ఈ కమాండ్ సేవలు అందించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర వహించింది. కొరియా, వియత్నాం యుద్ధాల్లో ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. అయితే 2018లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టినప్పుడు చైనా ఆధిపత్యాన్ని నివారించడానికి హిందూ మహా సముద్రంలో బలీయమైన శక్తిగా ఉన్న భారత్ సహకారం కీలకమని భావించి ఈ కమాండ్ పేరును ‘యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్‌గా అమెరికా మార్చింది.
అయితే ఇప్పుడు ఇండ్‌పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారుతున్నాయి. చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ఆరాటపడుతోంది. అందుకోసమే ఇటీవల ట్రంప్ చైనాలో పర్యటించారు. చైనాకు దగ్గర కావడానికి, గతంలో ఆ దేశంతో అనుసరించిన తీవ్ర ఘర్షణ వైఖరిని విడనాడాలని అమెరికా భావిస్తోంది. ఈ కారణంగానే ఇండో పేరును కమాండ్ లోంచి తొలగించారని తెలుస్తోంది. అయితే పేరు మారినప్పటికీ ఈ కమాండ్ బాధ్యతలు కానీ, అది పర్యవేక్షించే సరిహద్దులు కానీ మారలేదని, అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత దేశ పశ్చిమ సరిహద్దు వరకు (హిందూ మహాసముద్రం సహా) రక్షణ బాధ్యతలను ఈ కమాండ్ ఇదివరకులానే చూసుకుంటుందని అమెరికా రక్షణ శాఖ సర్దిచెబుతోంది. అంతేకాక ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన నిర్వహణలో ఉన్న భూభాగానికి సంబంధించి సైనిక కమాండ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో భారత దేశానికి చెందిన చిత్రపటాన్ని తప్పుగా ప్రదర్శించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించింది. ఇవేవీ ట్రంప్‌కు తెలియకుండా జరగవు. దీన్ని బట్టి భారత్‌పై అమెరికా ఒలికించే ప్రేమ ఎటువంటిదో తేటతెల్లమవుతుంది. వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్‌ను అగ్రరాజ్యం దూరం పెడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జి7 శిఖరాగ్ర సమావేశం తరువాత ఫ్రాన్స్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లాంఛనంగా సంతకాలు చేశారు. అయితే ఇది తుది ఒప్పందం కాదు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న వివిధ అంశాలపై చర్చించేందుకు మరో 60 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు.
హర్మూజ్‌పై సార్వభౌమాధికారం తమకే ఉందని ఇరాన్ చెబుతోంది. హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ కోసం నియామావళిని రూపొందిస్తామని, ఒప్పందంలో భాగంగా ఒమన్‌తో చర్చలు జరుపుతామని ఇరాన్ పేర్కొంది. ఒకవేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఏదేమైనా హర్మూజ్ జలసంధిని తెరవడానికి మార్గం ఏర్పడిందని, ఇంధన ధరలు తగ్గుతాయన్న ఆశ కలుగుతోంది.
ఇదిలా ఉండగా పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించాల్సిన భారతీయ నౌకలకు ఆటంకం కలగకుండా మొత్తం 34 నౌకలను సురక్షితంగా రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో ఎరువులు తీసుకువస్తున్న 16 నౌకలు కూడా ఉన్నాయి. పరిస్థితి ఇంకా ఆలస్యమైతే ఈ ఎరువులను పర్షియన్ గల్ఫ్ రేవుల నుండి సౌదీ అరేబియా లోని యాన్బు పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా 1200 కిమీ రవాణా చేసి అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా భారత దేశానికి చేరవేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నౌకలు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, తదితర ఎరువుల కొరత దేశంలో రాకుండా ప్రభుత్వం ముందస్తుగా దాదాపు 5 మిలియన్ టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుంది.












