
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన బొగత జలపాతం మళ్లీ సవ్వడులు చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన పచ్చ-దనం మధ్య వెలసిన ఈ జలపాతం, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలకళను సంతరించుకుని నిండుగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న అటవీ ప్రాంతాల నుంచి ఇసుకవాగు ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, కొండకోనల గుండా నీరు నుర-గలు కక్కుతూ పాలధారలా కిందకు దుముకుతోంది. కొండల మధ్య హోరెత్తుతున్న జలపాత దృశ్యాలు పర్యాటకులను మంత్రము-గ్ధులను చేస్తున్నాయి. ‘తెలంగాణ నయాగార’గా పిలువబడే బొగత జలపాతం రూపురేఖలు వర్షాకాలంలో మరింత సుందరంగా మారడంతో,
ఈ జలపాత సౌందర్యాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. భారీగా నీటి ప్రవాహం పెరగడంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు చేరుకొని వీకెండ్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఉప్పొంగుతున్న జలపాత దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ఉధృతి, ప్రవాహం తీవ్రంగా ఉన్నందున పర్యాట-కులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రక్షణ వలయాలు దాటి లోతున్న ప్రాంతాల్లోకి లేదా జారే రాళ్లపైకి వెళ్లవద్దని, సెల్ఫీల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. పర్యాటకుల భద్రత కోసం జలపాతం ప్రాంగణంలో సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.











