
బెంగళూరు: కావేరీ జలాల వివాదంపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బెంగళూరులో జరపాల్సిన పర్యటనను తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కొనసాగడానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం కావేరీ జలాలపై నెలకొన్న అంతర్‌రాష్ట్ర వివాదంపై విజయ్‌తో డీకే శివకుమార్ సోమవరంనాడు చర్చలు జరపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన పర్యటన వాయిదా వేసుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు.
కావేరీ వివాదంపై ఆదివారంనాడు జరిగిన అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో డీకే మాట్లాడుతూ.. ‘విజయ్ అంటే నాకెంతో గౌరవం ఉంది. ఆయన రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఎంతో ధైర్యం కలిగిన నేత. పర్యటన వాయిదా వేసుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నాను. తమ మధ్య రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ఆయన కర్ణాటక రావాలనుకున్నారు. మరింత సుహృద్భావ వాతావరణంలో కలుద్దామని రిక్వస్ట్ చేశాను. తాము పరస్పరం గౌరవించుకుంటూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అంతిమంగా అందరూ ఇండియా కోసం పనిచేయాలి’ అని అన్నారు. తమిళనాడుకు 15రోజుల పాటు 3,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ ఇటీవల ఆదేశించడంతో కర్ణాటక-తమిళనాడు మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.











