గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెట్ షర్మిలా ధన్‌ఖడ్ షాట్‌పుట్ విభాగంలో స్వర్ణం సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. 40 ఏళ్ల వయసులో షర్మిలా ధన్‌ఖడ్ ఏకంగా పసిడి పతకం గెలిచి ఔరా అనిపించింది. పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్ ఎఫ్ 57విభాగం ఫైనల్లో షర్మిలా 9.81 మీటర్ల దూరంలో త్రోను విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు పతకం సాధించి పెట్టింది. హర్యానాకు చెందిన షర్మిల జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. ఒకవైపు కుటుంబ కలహాలు మరోవైపు పోలియో, ఆర్థిక సమస్యలు దాటుకుని కామన్వెల్త్ వంటి అగ్రశ్రేణి క్రీడల్లో స్వర్ణం సాధించి నయా చరిత్ర సృష్టించింది. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన మరో అథ్లెట్ శిల్పా శైల కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఎఫ్ 57 ఈవెంట్‌లో శిల్ప అద్భుత ఆటతో అలరించింది. ఈ క్రమంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దకించుకుంది. కాగా, అసాధారణ ఆటతో పసడి పతకాన్ని సాధించి భారత ఖ్యాతిని చాటిన షర్మిలాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అభినందించారు.

అజయ్‌కు సిల్వర్

కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు కుర్రాడు వల్లూరి అజయ్ బాబు రజతం మెరిశాడు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అజయ్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన అజయ్ బాబు గ్లాస్గో క్రీడల్లో రజతం సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. 78 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అజయ్ ఓవరాల్‌గా 330 కిలోల బరువును ఎత్తి రజతం దక్కించుకున్నాడు. స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ సెక్షన్‌లో 181 కిలోల బరువును ఎత్తాడు. అయితే మలేసియాకు చెందిన హిదాయత్ 331 కిలోల బరువును ఎత్తి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అజయ్ కంటే హిదాయత్ కేవలం ఒక కిలో బరువు మాత్రమే అదనంగా ఎత్తాడు. దీంతో అజయ్ స్వర్ణం సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఇదిలావుంటే అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాస రావు 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య సాధించి సత్తా చాటారు. తాజాగా ఈ క్రీడల్లో ఆయన వారసుడు అజయ్ రజతం సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు.

సర్వేశ్‌కు రజతం

పురుషుల హైజంప్‌లో భారత అథ్లెట్ సర్వేశ్ కుషారే హైజంప్‌లో రజతం సాధించాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో సర్వేశ్ 2.25 మీటర్ల మార్క్‌ను అందుకుని వెండి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో సర్వేశ్ అంచనాలకు మించి రాణించాడు. జమైకా అథ్లెట్ బ్యాక్‌ఫోర్డ్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన జాక్ కిమాని కాంస్యం సొంతం చేసుకున్నాడు.