
పాల్వంచ మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకున్నది. పాల్వంచలోని బొల్లోరిగూడెం ప్రాంతంలో ఓ పసికందు తలభాగం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం బొల్లోరిగూడెం ప్రాంతంలో వీధి కుక్కలు ఏదో పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లిచూడగా, ఒక పసికందు తలభాగాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యం కనిపించింది. ఈ భయానక దృశ్యాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన జనం కుక్కలను అక్కడినుంచి తరిమివేశారు.
సమాచారం అందుకున్న పాల్వంచ పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు తల భాగాన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ పసికందు ఎవరనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు శిశువును చంపి ఇక్కడ పడేశారా, లేక మృతదేహాన్ని కుక్కలు ఎక్కడైనా శ్మశానం నుంచి తీసుకువచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల జరిగిన ప్రసవాల గురించి పట్టణ ఎస్సై నాగరాజు ఆరా తీస్తున్నట్టు సమాచారం.














