
యుద్ధ విరమణ దిశగా అమెరికా, ఇరాన్
యురేనియం నిల్వలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం?
60 రోజుల వ్యవధిలో కార్యాచరణ హర్మూజ్‌ను తెరిచి ఉంచేందుకు సానుకూలత
ఇంధన సంక్షోభ నివారణ దిశగా అడుగులు
అతి త్వరలో శుభవార్త వింటారని భారత పర్యటనలో
ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్య
కైరో ః పశ్చిమాసియా యుద్ధ విరమణ దశకు అత్యంత చేరువలో ఉన్నామని అమెరికా దౌత్యవర్గాలు, అధికారులు ఆదివారం ప్రకటించారు. హర్మూజ్ జలసంధి మార్గం పున ః ప్రారంభం, అత్యంత ఉన్నత స్థాయి శుద్ధి చేసిన యురేనియం నిల్వలు వదులకునేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇక ఇరు పక్షాల మధ్య ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు? ఎక్కడ అనేదే మిగిలిన ప్రక్రియ అని తేల్చిచెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఆదివారమే డీల్ కుదిరిందని ప్రకటించారు. కొద్ది గంటల్లోనే ఒప్పందం కుదురుతుందని తెలిపారు. ఇరాన్ తన యురేనియం నిల్వలు త్యజించడం కీలక డిమాండ్ అని ట్రంప్ ప్రకటిస్తూ వచ్చారు. అయితే యురేనియం వదులుకునే విషయంలో సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఇరాన్ బహిరంగంగా ఇంతవరకూ ప్రకటించలేదు.
అయితే మొత్తం మీద ఒప్పందానికి సిద్ధపడిందని స్పష్టం అయింది. ప్రత్యేకించి తనకు తానుగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఇంధన సంక్షోభంలో చివరికి తన ప్రయోజనాలుకూడా కుంటుపడుతూ ఉండటాన్ని గుర్తించిందని వెల్లడైంది. సంప్రదింపులలో గణనీయ ప్రగతి తలెత్తింది. అయితే ఇదే తుది దశ అనుకోవడానికి వీల్లేదని రూబిన్ భారతదేశంలో తెలిపారు. ఇదే దశలో భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. రూబియో ప్రకటనకు స్పందనగా దీనిని విడుదలచేశారు. ఇరాన్ ఎప్పుడూ అణ్వాయుధం సంతరించుకోవాలని చూడలేదన్నారు. అయితే అవసరం అయిన అణు సాంకేతికత తమ వద్ద ఉండటం తమ దేశ హక్కు అని తేల్చిచెప్పారు. తాము అణ్వాయుధ తయారీ స్థాయికి చేరుకున్నప్పటికీ యురేనియం శుద్ధిని కేవలం శాంతియుత ప్రయోజనాలకే వాడుతామని, ఇదే విషయాన్ని ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెషకియాన్ కూడా తెలిపారని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.
ఇరాన్ ముందుగా యురేనియం నిల్వలు వదులుకునేందుకు సిద్ధపడుతుంది. తరువాత 60 రోజుల వ్యవధిలో దీనికి సంబంధించి కార్యాచరణ అమలు అవుతుంది. ఒప్పందంలో ముందుగా కేవలం విధివిధానాలురూపొందిస్తారని వెల్లడైంది. ఇరాన్ వద్ద ఇప్పుడు 440.9 కిలోలు అంటే 972 పౌండ్ల యురేనియం ఉంది. ఇప్పటివరకూ 60 శాతం వరకూ యురేనియం శుద్ధి జరిగింది. అయితే పూర్తి స్థాయి శుద్ధి, అణ్వాయుధ తయారీకి అవసరం అయిన 90 శాతం మోతాదుకు సాంకేతిక స్థాయిలో అతి కొద్దిదూరంలో ఉందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిర్థారించింది. ఇక శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఏ విధంగా వదుల్చుకుంటుందనేది కీలక అంశం.
ఇందులో ఎక్కువ భాగాన్ని పనిచేయకుండా చేస్తారు. కొంత భాగం తమకు కావల్సిన రష్యాకు అందిస్తారని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇక చర్చలలో పురోగతిని ఇరాన్ కూడా ధృవీకరించింది. అయితే తాము పూర్తి స్థాయిలో అమెరికాను నమ్మడం, మునుపటి అనుభవాలతో వీలు కాదని ,డీల్‌కు సరైన రక్షణ కల్గితే డీల్ కుదిరినట్లే అని ఇరాన్ వర్గాలు రెండు రోజులుగా చెప్పడం కీలక పరిణామం అయింది. హర్మూజ్ ప్రతిష్టంభన చిలికి చిలికి చివరికి తమ సరఫరా వ్యవస్థకు ఇబ్బందికరం కావడం కూడా ఇరాన్‌ను శాంతి ఒప్పందం సమ్మతికి నడిపించాయని పరిశీలకులు తెలిపారు.
యురేనియం నిల్వల అప్పగింతకు అంగీకరించేది లేదుః ఇరాన్
తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు వదులుకునేందుకు సిద్ధంగా లేమని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం ప్రకటించారు. ఇరాన్ అణు విషయాలు ఇప్పుడు కుదిరే ఒప్పందంలో అంతర్భాగం కావడం లేదని తెలిపారు. అణు అంశాలను తరువాతి సంప్రదింపుల దశలో తేల్చుకోవచ్చు. ఇప్పుడు వేరే విషయాలే ఉంటాయి. ఇరాన్ తమ హక్కుగా సంతరించుకున్న నిల్వలు వదులుకునే ప్రసక్తే లేదు. ఇది అర్థరహితం అవుతుందని చెపుతూనే, ఒప్పందం కాదనడం కూడా సముచితం కాదని భావిస్తున్నట్లు తెలిపారు.











