అమరావతి: టిడిపి ప్రకటించిన మహిళలకు ౩౩ శాతం రిజర్వేషన్ ఇప్పుడు దేశ రాజకాయాల్లో చర్చనీయాంశంగా మారిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చంద్రబాబు కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కలైనా.. తాజా జనాభా లెక్కలైనా మనకు నష్టం.. అందుకే ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే న్యాయం జరుగుతుందని, పెంచిన స్థానాలు మహిళలకు కేటాయించవచ్చునని సిఎం తెలియజేశారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చునని, పునర్విభజన, మహిళ బిల్లుపై కేంద్రం పట్టుదలగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు బిల్లులను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందని, రెండు బిల్లులను విడదీసి చూడాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ రెండు బిల్లులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.