
ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాంపల్లిలోని ఏసిబి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మార్చిలో ఛార్జ్‌షీట్ దాఖలైన అనంతరం ఆయన తొలిసారిగా కోర్టు ఎదుట హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఆదేశాల మేరకు కెటిఆర్ లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించగా, తదుపరి విచారణ రోజు లక్ష రూపాయల చొప్పున మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కెటిఆర్‌తో పాటు నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి సైతం కోర్టులో పూచీకత్తు సమర్పించారు. విచారణలో కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌తో పాటు ఇతర పత్రాలను మాత్రమే అందజేయగా, కేసు మెరిట్స్‌పై ఎలాంటి విచారణ జరగలేదు.
కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 25కు వాయిదా వేసింది. కాగా, అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది మార్చిలో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కెటిఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి సహా మరో ఇద్దరి పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. కాగా, ఉదయం కెటిఆర్ తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకోగా, ఆయన వెంట పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. కోర్టు కార్యక్రమం అనంతరం, రాత్రి కన్నుమూసిన ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు కెటిఆర్ నర్సంపేటకు బయలుదేరి వెళ్లారు.











