నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశంలో ఎలాంటి తీవ్ర పరిణామాలను సృష్టించిందో తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ ఈ అక్రమాలపై సాగించిన ఉద్యమం కార్చిచ్చులా దేశం లోనే కాదు, విదేశాల్లో కూడా వ్యాపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూకోర్టు కాంప్లెక్సులో పేపర్ లీకేజీ కేసులను ప్రత్యేకంగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఢిల్లీ హైకోర్టు ఆగమేఘాలపై ఏర్పాటు చేసింది. దీంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సామర్థంపై సమీక్ష తెరపైకి వచ్చింది. అయితే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారే కానీ కేసులకు తగినట్టు కొత్తగా న్యాయమూర్తులను నియమించడం కానీ, న్యాయవ్యవస్థలో అదనపు సామర్థాన్ని సమకూర్చక పోవడంతో ఒకవంక న్యాయవాదులు, సిబ్బంది, వనరుల కొరత, మరోవంక పెండింగ్ కేసుల భారంతో అవి సతమతమవుతున్నాయి.

ఈ కోర్టులు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సంస్కరణలు అమలులో ఉన్నాయా లేదా ఆలోచించాల్సిందే. సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ నిర్ణయించిన సమయానికి క్రమబద్ధంగా జరుగుతోందా? కేసులు అనవసరంగా వాయిదా పడకుండా కొనసాగేందుకు భాగస్వామ్య పక్షాలు కలిసి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయా? ఇవన్నీ సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పేపర్ లీక్ కేసుల విచారణ చేపట్టడమంటే ప్రస్తుతం కోర్టుల్లో కొనసాగుతున్న న్యాయమూర్తులకే ఈ అదనపు బాధ్యతలు అప్పగించవలసి వస్తుంది. ఇప్పటికే ఉన్న న్యాయమూర్తులను, న్యాయవనరులను ఒక చోటనుంచి మరో చోటికి మార్చుకుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పనిచేస్తాయి. ఫలితంగా ప్రత్యేకంగా కేటాయించిన కేసులు వేగంగా ముందుకు సాగుతాయి.

కానీ న్యాయమూర్తులు అంతకు ముందు విచారిస్తున్న ఇతర కేసులను వెనక్కు నెట్టవలసి వస్తుంది. పెండింగ్ కేసులు అలాగే కొనసాగుతుంటాయి. అత్యాచార కేసులు, పిల్లలపై లైంగిక నేరాల (పోక్సో) కేసుల ప్రత్యేక విచారణ కోసం 2019లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. కొంతవరకు పరిమిత సంఖ్యలోనే కేసులను విచారించి ఫలితాలు అందించాయి. కానీ న్యాయమూర్తుల కొరత, వనరుల కొరత ఈ కోర్టులను పీడిస్తున్నాయి. న్యాయమూర్తులకు, సిబ్బందికి, ఇతర అవసరాలకు నిధులు కేటాయించవచ్చు కానీ అసలు సమస్య న్యాయ వ్యవస్థ సామర్థమే. దేశం మొత్తం మీద సాధారణ కోర్టుల్లో ప్రస్తుతం 4.8 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో 74 శాతం నేరాల కేసులు. యాసిడ్ కేసులు, చైన్‌స్నాచింగ్, సైబర్ క్రైమ్, హత్యలు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి.

వీటిని పరిష్కరించాలంటే న్యాయవాదులకు కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. ఈ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు సవాలుగా మారింది. అలాగే దేశం మొత్తం మీద ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో దాదాపు 2.45 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏటా కేసుల క్లియరెన్సు రేటు చాలా తక్కువగా ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్తగా వస్తున్న కేసుల భారాన్ని తట్టుకునేంత వేగంగా వ్యవస్థ ముందుకు సాగలేకపోతోంది. 2025లో దాదాపు 1.4 లక్షల కేసులు నమోదు కాగా, కేవలం 66,000 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నిజంగా వేగంగా న్యాయాన్ని అందించగలుగుతున్నాయో లేదో సమీక్షించాలనుకుంటే ఆ కేసుల డేటా అవసరం. జాతీయ న్యాయడేటా గ్రిడ్ (ఎన్‌జెడిజి) ద్వారా సాధారణ కేసుల్లో ఎన్ని ఎంతకాలం పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని పరిష్కారమయ్యాయి? తదితర వివరాలు లభిస్తాయి కానీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల కేసుల వివరాలు మాత్రం లభ్యం కావు, ఇలాంటి పారదర్శకత లేకుండా ఈ కోర్టులు తమ లక్షాన్ని ఎంతవరకు నెరవేర్చ గలుగుతాయో సమీక్షించడం కష్టం అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రాసిక్యూటర్లు సరిపడా లేకపోవడంతో ఒకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకే రోజులో పలు కోర్టుల్లో హాజరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేయాలన్న శ్రద్ధ కనిపించడం లేదు.

క్లిష్టమైన క్రిమినల్ కేసుల విచారణ ఆందోళనకరమైన విషయంగా మారింది. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఎక్కువ న్యాయ పరిజ్ఞానం, పరిశోధన వనరులు కలిగిన డిఫెన్స్ లాయర్ల బృందాలతో పోరాడాల్సి వస్తోంది. ఇప్పుడు పేపర్ లీక్ కేసులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి పరికరాల నుంచి లభించే డిజిటల్ సాక్షాలపై ఆధారపడి ఉంటున్నాయి. ఆ సాక్షాలను పరిశీలించడానికి సైబర్ ఫోరెన్సిక్ అవసరం. కానీ ఫోరెన్సిక్ విభాగంలోనూ నిపుణులు, సిబంది కొరత, మౌలిక సదుపాయాల లోటుతో మితిమీరిన పనిభారంతో ఫోరెన్సిక్ లేబొరేటరీలు అల్లాడుతున్నాయి. ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేయడం, ఫోరెన్సిక్ సామర్థాన్ని విస్తరింప చేయడం, జుడీషియల్ ఉద్యోగాలను భర్తీచేయడం ఇవన్నీ జరిగితేనే కానీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు న్యాయాన్ని వేగంగా అందించలేవు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఎంత సమర్థంగా పనిచేయాలంటే దానికి ముందు జరిగే దర్యాపు అంత పకడ్బందీగా ఉండాలి. సుశిక్షితులైన పరిశోధకులు, సాంకేతిక, ఫోరెన్సిక్ పరిశోధనల సహాయం, విశ్వసనీయమైన సాక్షాలుంటే కానీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులనుంచి ప్రధాని మోడీ ఆశించిన న్యాయం వేగంగా లభించదు. వ్యవస్థాపరమైన ఈ సమస్యలను పరిష్కరించకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మాత్రమే త్వరితగతిన న్యాయం అందిస్తాయని ఆశించడం ఎండమావి అవుతుంది.