మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయండి ఫ్లీజ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముఖ్య భూమిక పోషించారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు మరణించారని, బలిదానాలు చేశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్‌మెంట్ పక్కాగా జరిగిందన్నారు.

వైఎస్ ఉన్నంత వరకూ సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రియంబర్స్‌మెంట్ సక్రమంగా చేయడం లేదన్నారు. వైఎస్ శిష్యునిగా చెప్పుకునే భట్టివిక్రమార్క ఈ విషయంలో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బిసిలంతా తనపై వత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచిందన్నారు. విద్యార్థుల పోరాటం శుభసూచికంగా ఆయన అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందన్నారు.

విద్యారులకు నష్టం జరుగుతుందని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారని ఆయన తెలిపారు. 21 ఏళ్ళకే యువత ఎన్నికల్లో పోటీ చేసేలా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటించారు.