తెలంగాణ రాష్ట్రం ఎన్నో సహజ వనరులకు పెట్టింది పేరు. అలాగే విద్యావనరుకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం తెలంగాణకు ఉంది. రాష్ట్రంలో పేరు మోసిన విద్యాలయాలు, మరియు సాంకేతిక, ఫార్మా,వైద్య విద్యాసంస్థలు కూడా ఉండడం తెలంగాణకు తలమానికం. ప్రతి విద్యాసంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ విద్యా అర్హతను పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని 2008వ సంవత్సరంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద వర్గాల విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంజనీరింగ్,మెడిసిన్, లా, ఫార్మసీ కోర్సులు చదివే అవకాశం ఈ పథకం కారణంగానే లభించింది. ఈ పథకం ద్వారా లక్షల మంది విద్య ఉన్నత చదువులు చదవడంతో పాటు దేశ,విదేశాల్లో స్థిరపడి ఆర్థికంగా వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. అంతేకాకుండా దేశానికి విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా అర్జించి పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ,బిసి, ఈబీసీ, మైనారిటీ కుటుంబాలకు ఉన్నత స్థితికి చేర్చే ఈ వినూత్న పథకాన్ని పాతరేసే కుట్రలను నేడు పాలకపక్షం చేస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్ ల మీద ఆధారపడి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ పథకం అమలుకు ప్రతిఏటా 2,500 కోట్ల నిధులు అవసరం ఉండగా బడ్జెట్లో అరకొర నిధులు కేటాయిస్తూ కనీసం కేటాయించిన నిధులను సైతం సరి అయిన సమయంలో విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారు. పథకం మొదట్లో లేని అనేక షరతులు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతోపాటు కోర్సు మొత్తం ఫీజులో ఎంతవరకు తప్పించుకోవచ్చు అనే కుట్రలతో ఈ పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుండి ఇప్పటివరకు 10,000 కోట్ల బకాయిలు పేరుకుని పోయాయి. దీనికి ప్రధాన కారణం విద్య పట్ల విద్యార్థి లోకం పట్ల పాలకుల నిర్లక్ష్యం వైఖరి తెలుస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల ను విడుదల చేయకపోగా ఎస్సీ, ఎస్టీ బీసీ,ఈ బీసీ,మైనారిటీ విద్యార్థులకు ఈ పాలక పక్షం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను 30 నుండి 35% పెంచడంలో ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శించి పేద తల్లిదండ్రులకు గుండెల పై మరింత భారాన్ని మోపింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లకు ఇచ్చే నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా తిరిగి వెనక్కు వెళుతున్నాయి.

విద్యా సంవత్సరం అంతా పరీక్షల కోసం కష్టపడి చదువుకుంటే ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని హాల్ టికెట్ ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు వేధించడంతో చాలామంది విద్యార్థులు చదువుకు స్వస్తి చెబుతున్నారు. మరి కొంతమంది విద్యార్థులు మానసిక ఆవేదనను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాలకులు నిధులు మంజూరు చేయకుండా కేవలం విద్యార్థిలోకాన్ని మోసం చేయడమే కాకుండా కళాశాల ఫ్యాకల్టీ కి జీతాలు అందక అర్థ ఆకలి తో అలమటించే పరిస్థితులు నేలకొన్నాయి. స్కాలర్షిప్ లు అందకపోవడంతో కడుపు నింపుకోవడానికి తోచిన పనిని చేసుకుంటూ కాలాన్ని వెల్లదీసే దుస్థితి విద్యార్థి లోకానికి దాపరించింది. విద్యారంగం పట్ల చిత్త శుద్ధిలేని పాలకుల వైఫల్యాల వల్ల చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. పాలకుల నిర్లక్ష్య పోకడాల వల్ల ప్రవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా అప్పుల పాలు అవుతున్నాయి.

ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు పైచిలుకు ఉంది.దీనిలో కేవలం 2500 కోట్ల రూపాయలతో 14 లక్షల మంది బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువులకు నిధులు సరిపోతాయి. ఈ మొత్తం బడ్జెట్లో కేవలం. 0.77 శాతం మాత్రమే. ఈ నిధులు కూడా విడుదలక చేయకపోగా అలసత్వం వహించడం చాలా దురదృష్టకరం. ఇటీవల కొన్ని కళాశాలాల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గురించి స్పష్టమైన వైఖరిని తెలిసేలా కౌంటర్ దాఖలు చేయాలని పాలకులను కోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినా పాలన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి యాజమాన్యాలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పిన మధ్యంతర జడ్జిమెంట్ రావడానికి పాలకులే పరోక్షంగా సహకరించినట్లు కనిపిస్తుంది. విద్యార్థుల చదువులు కొనసాగేలా పాలకులు దృష్టి పెట్టి వీలైనంత తొందరగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి రాబోయే తరాలకు విద్యా వనరును చేరువచేసేలా ప్రయత్నాలు చేయాలి.

- వంశీకృష్ణగౌడ్ బండి