
జైపూర్: వరుస విజయాలతో ఐపిఎల్‌లో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను ఓడించడంతో రాజస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే జోరును ఢిల్లీపై కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతున్నారు.
ఓపెనర్లు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కిందటి మ్యాచ్‌లో డొనొవన్ ఫెరీరా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. శుభమ్ దూబెతో కలిసి అతను జట్టును విజయపథంలో నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. జురెల్, జడేజా, కెప్టెన్ పరాగ్, ఆర్చర్, బర్గర్ తదితరులతో రాజస్థాన్ బలంగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీని కూడా తక్కువ అంచనా వేయలేం. రాహుల్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. సమీర్ రిజ్వి, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్, నితీశ్ రాణా, అశుతోష్ శర్మ, నిసాంకా, జేమీసన్ తదితరులతో ఢిల్లీ కూడా పటిష్టంగానే ఉంది. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.










