మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి భవిష్యత్‌కు ఇప్పుడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించబోతున్నామని, ప్రపంచానికి ఒక దిక్సూచీగా భారత్ ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనాన్ని (ఎఫ్‌సిడిఏ) సిఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభిం చారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిబ్బ న్ కట్ చేసి ఈ ఆఫీసును ప్రారంభించారు. దీంతోపాటు అధికారిక లోగో, నూతన వెబ్‌సైట్‌ను కూ డా సిఎం ఆవిష్కరించారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోని ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్‌ల సంస్థ ప్రతినిధులకు

లెటర్ ఆఫ్ అవార్డును సిఎం రేవంత్‌రెడ్డి అందించారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోని కొన్ని గ్రామాలకు తీసుకువస్తూ సభా వేదికపైన సిఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు. ఎఫ్‌సిడిఏ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన  సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని, 200 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను విస్తరించడం వల్లే సికింద్రాబాద్‌తో కలిసి జంట నగరాలుగా విరాజిల్లుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోందని, బంగారానికి కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

హైటెక్‌సిటీ, ఔటర్, శంషాబాద్ ఎయిర్ పోర్టులను అడ్డుకున్నారు

1908లో తుఫాన్ వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం నవాబు మూసీ నదిపైన నిర్మాణాలు చేపట్టారని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచడం వల్ల శత్రు దుర్భేద్యంగా మారిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆనాటి పాలకులు సైబరాబాద్‌ను నిర్మించి గొప్ప నగరాన్ని ప్రపంచానికి అందించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీలను కొందరు వద్దే వద్దన్నారని ఆయన అన్నారు. ఆనాడు కూడా అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆయన ఆరోపించారు. మూసీలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారని, ఆనాటి పాలకులు హైటెక్‌సిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు , జీనోమ్ వ్యాలీ లాంటి తీసుకురాకపోతే ఈనాడు 10 లక్షల మందికి ఉపాధి లభించేదా.. ? అని ఆయన ప్రశ్నించారు.

కళ్లలో నిప్పులు పోసుకొని, కడుపులో విషం నింపుకొని....

రావణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభావుడులా ఆనాడు కొందరు హైటెక్‌సిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు , జీనోమ్ వ్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేశారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో ఉండి మారీచుడు, సుభావుడిని పంపించారని భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు పేర్కొంటున్నారని, కళ్లలో నిప్పులు పోసుకొని, కడుపులో విషం నింపుకొని అమెరికాలో కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుపడిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ఈ ప్రాంతం వాళ్లే వెళతారని,

ఈ నగరాన్ని ఇక్కడి వాళ్లే కాపాడుకుంటారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వాళ్లని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని, వాళ్లకు గతం తప్ప భవిష్యత్ లేదని, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతి పక్ష హోదా కూడా రాదని, ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.సరిగ్గా 150 రోజుల్లో ప్యూచర్ సిటీ అథారిటీ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి భారత్ ఫ్యూచర్ సిటీ కీలకం కావాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే 8 ఏళ్లలో న్యూయార్క్, సింగపూర్‌తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదు

నాడు కులీ కుతుబ్‌షా, నిజాంరాజులు దార్శనికతతో హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం వల్లే ఈరోజు నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారి తర్వాత ఐటీ రంగానికి పునాది పడిందని ఆయన అన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మిస్తుంటే కొందరు నవ్వి ఎగతాళి చేశారని, ప్రయాణాలను సులభతరం చేసే ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని కూడా తీవ్రంగా అడ్డుకున్నారని సిఎం గుర్తుచేశారు. ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేసిన శక్తులే ఇప్పుడు తాము నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, రాజకీయంగా ఎలాంటి కుట్రలు పన్నినా భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కుంటలను చెరపట్టడం వల్లే

తొలకరి వర్షం పడితేనే హైదరాబాద్‌లో రోడ్డులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయని, కిలోమీటర్ దూరానికి రెండు నుంచి నాలుగు గంటల పట్టిందని, రూ.100 కోట్లకు ఎకరం అమ్మామని జబ్బలు చరుచుకున్న వాళ్లు నిన్నటి వరదలకు సమాధానం చెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కుంటలను చెరపట్టడం వల్లే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాలనీలు, బస్తీలకు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులను, కుంటలను ఆక్రమించుకున్న వారి కట్టడాలను నిర్ధాక్ష్యణంగా కూలుస్తున్నామని, తాము ఎవరైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..? ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్దరిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

లేక్ ఎకనామీని తయారు చేస్తున్నాం

లేక్ ఎకనామీని తయారు చేస్తున్నామని, రాజేంద్రనగర్‌లో చెరువు ఆక్రమణలను తొలగించి పునరుద్దరించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కూకట్‌పల్లి నల్ల చెరువు, అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్దించామని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంటను ఆక్రమించి హెలికాఫ్టర్‌లో పూలు చల్లారని గత ప్రభుత్వం ఆయనకు రాసి ఇచ్చిందా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరపడితే వాళ్ల పనిపట్టి వాటిని పునరుద్దించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గండిపేట, హిమాయత్ సాగర్‌ను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తే వాళ్లను ఖాళీచేయించదానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

500 పెద్ద కంపెనీలను ఫ్యూచర్ సిటీకి రప్పించబోతున్నాం

ముంబయిలో వర్షం వస్తే జనం బయటకు రాని పరిస్థితి ఉందని, చెన్నైలో వర్షం వస్తే పడవల్లో తిరుగుతున్నారని, కొల్‌కత్తాలో శాంతిభద్రతలు లేవని, బెంగళూరులో ట్రాఫిక్ జాంలు ఉన్నాయని, హైదరాబాద్‌లో కబ్జాకోరుల పనిపడుతున్నామని, ప్రపంచం మన వైపు చూస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు సువర్ణ అధ్యాయాన్ని సృష్టించామని, గ్రీన్ ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీలతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ది గాంచిన 500 పెద్ద కంపెనీలను ఫ్యూచర్ సిటీకి రప్పించబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మరో గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచ దేశాలను ఇక్కడికి రప్పించామని, ఫ్యూచర్ సిటీలో కొన్ని గ్రామాలను ఈ రోజు కలిపామని, రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో అనుమానం లేదని ఆయన అన్నారు.

కాలుష్య రహిత నగరంగా దీనిని తీర్చిదిద్దుతాం

ప్రపంచానికి దిక్సూచిగా ఈ ప్రాంతం నిలుస్తుందని, కాలుష్య రహిత నగరంగా దీనిని తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయానికి వస్తానని, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వారానికోసారి ఇక్కడికి వస్తారని మీ సమస్యలను మాతో చెప్పుకోవాలని ఆయన సూచించారు.

ఎఫ్‌సిడిఏ భవన నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట

ఈ ఎఫ్‌సిడిఏ భవన నిర్మాణంలో పర్యావరణహితమైన సస్టైనబుల్ డిజైన్ పద్ధతులను’ పాటించారు. భవనం పైకప్పు మీద ఫొటో వోల్టాయిక్ షేడ్స్‌ను అమర్చారు. ఇవి సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, లోపల సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్స్, నీటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన ఎకో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి రీచార్జీ చేసే విధానం, వ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు వినియోగించడంలాంటివి పర్యావరణ పరిరక్షణ లాంటి చర్యలను చేపట్టారు. భవనం చుట్టూ ఉండే ల్యాండ్ స్కేపింగ్‌లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు తీసుకున్నారు.

టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి భవన నిర్మాణం

ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచడానికి బయోఫిలిక్ డిజైన్ ద్వారా లోపలి గదుల్లో కూడా పచ్చదనాన్ని నింపేలా ఏర్పాట్లు చేశారు. నిర్మాణంలో వాడుతున్న గాజు ఫ్యాకేడ్ కేవలం అందం కోసమే కాకుండా, వెలుతురు ఉండడంతో పాటు ఉష్ణోగ్రతను తగ్గించేలా ఏర్పాట్లుచేశారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న కలెక్షన్ పాండ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మేలు జరిగేలా ప్లాన్ చేశారు. మొత్తానికి టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి నిర్మిస్తున్న ఈ భవనం ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ సింబల్‌గా నిలువనుంది.కేవలం కార్యాలయంగా మాత్రమే కాకుండా, ఇది ఒక నాలెడ్జ్ హబ్‌లా కూడా సేవలందించనుంది.