ప్రధాని మోడీ ఇంటి ముందు నిరసన

ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు

రాహుల్, ప్రియాంక బలవంతంగా తరలింపు

న్యూఢిల్లీ: ప్రధాని నివాసం ముందు మూడు గంటలకుపైగా రాహుల్ సాగుతున్న ఆందోళనను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. కాసేపటికి రాహుల్, ప్రియాంక గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, అఖిలేష్ యాదవ్, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులు సహా పలువురు ఎంపిలు, నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. పోలీసులు తరలిస్తున్న క్రమంగా రాహుల్ తీవ్రంగా ప్రతిఘటించారు. నేలపై పడుకున్న ఆయనను పైకి లేపేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది.

తోపులాట క్రమంలో రాహుల్ కంటి కింద స్వల్పగాయం కావడంతో పాటు ముక్కు రక్తం బయటికి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన కాళ్లు, చేతులకు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుత పరిస్థితి ఇదీ’ అని రాహుల్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక ప్రియాంక గాంధీని వాళ్లను తరలించే బస్సు కదులుతుండగానే బలవంతంగా ఎక్కించారు. ఆమె మెట్ల వద్ద వేలాడుతూనే పయనించారు. అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం స్టేషన్‌కు, ప్రియాంకను మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు, ఎంపిలను కింగ్స్‌వే పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాహుల్, ప్రియాంక గాంధీని చూసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పోలీస్ స్టేషన్‌లకు వెళ్లారు. తొలుత అనుమతి నిరాకరించిన పోలీసులు కాసేపటికి వారిని కలుసునేందుకు అనుమతించారు.