
పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026పై చర్చ సందర్భంగా ‘అనుచిత వ్యాఖ్యలు’ చేశారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నోటీసును గురువారంనాడు ఆయన అందజేశారు. హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని, అభ్యంతకరమైన పదజాలం వాడారని మూడు పేజీల నోటీసులో అనూరాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం దీనిని సభాహక్కుల కమిటీకి పంపాలని, తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. తన వ్యాఖ్యలపై హోం మంత్రికి, సభకు బేషరతుగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో మాట్లాడిన విషయాలను రాహుల్ లోక్‌సభలో ప్రస్తావిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం తెలిపాయి. తీవ్ర గంగరగోళ పరిస్థితుల మధ్య రాహల్ వ్యాఖ్యలను సభా రికార్డులను తొలగించాలని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు.











