
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ చేపట్టవద్దని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎలాంటి నివేదికలూ దాఖలు చేయవద్దని స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కర్ణాటకకు చెందిన ఎస్. విఘ్నేశ్ శిశిర్‌తోపాటు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది.
రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఈ విచారణ ప్రక్రియను తీవ్రంగా తప్పుబట్టారు. ఇదంతా ‘కక్ష సాధింపు చర్య’ అని పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించే అర్హత శిశిర్‌కు ఉందా అని ప్రశ్నించారు. పిటిషనర్ తన నేపథ్యం, అర్హతలకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. “ఇలాంటి ప్రక్రియకు చట్టంలో ఎలాంటి గుర్తింపూ లేదు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య. ఇది అత్యంత దురదృష్టకరం. ఇదే పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు” అని సిబల్ పేర్కొన్నారు. సీబీఐ పాత్రపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటివరకు ఆ సంస్థ ఫిర్యాదును ధ్రువీకరించడం మాత్రమే చేసిందన్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉన్నప్పటికీ, వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు తీవ్ర సందేహాలకు తావిస్తోందని వాదించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రక్రియలో సీబీఐ, ఈడీల పాత్ర ఏమీ లేదన్నారు. ఫిర్యాదులో ప్రాథమికంగా విచారణ చేపట్టదగిన నేరాలకు సంబంధించిన అంశాలు ఉంటే ఆరోపణలు తీవ్రమైనవేనని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చే ముందు సహజ న్యాయసూత్రాలను పాటించారా లేదా అన్నదే తమ ముందున్న ప్రధాన అంశమని స్పష్టం చేశారు. “కోర్టు ఏదైనా ఆదేశం ఇవ్వాలనుకుంటే సహజ న్యాయసూత్రాలను పాటించాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు.
వర్చువల్‌గా విచారణకు హాజరైన పిటిషనర్ శిశిర్.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ వ్యవహారం ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందస్తు దశలోనే ఉందని, ఈ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదనలు వినాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు. ఆరోపణలు అంత తీవ్రమైనవని భావిస్తే సంస్థలు సొంతంగా ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు. “ఇది అంత తీవ్రమైన వ్యవహారమైతే మీ సంస్థ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉంది? చర్యలు తీసుకోవడానికి కోర్టు ఆదేశాలు అవసరమా? మీ అంతట మీరుగా ఏమైనా చర్యలు చేపట్టారా?” అని కేంద్ర ప్రభుత్వ న్యాయాధికారిని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై సీబీఐ చేపట్టిన విచారణకు సంబంధించిన వ్యవహారమే ఈ కేసుకు మూలం. ఈ అంశంపై సీబీఐ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనం జులై 20న కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ ఎంతవరకు వచ్చిందో పూర్తి వివరాలతో సీనియర్ సీబీఐ అధికారి తాజాగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.











