ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ నిర్ధేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను కెప్టెన్ రియాన్ పరాగ్ ఆదుకున్నాడు. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) విఫలమయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌తో కలిసి కెప్టెన్ పరాగ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జురెల్ 42 పరుగులు చేశాడు.

మరోవైపు పరాగ్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పరాగ్ 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. జడేజా కూడా దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 6 వికెట్లకు 225 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు నిసాంకా, రాహుల్‌లు ఢిల్లీకి శుభారంభం అందించారు. నిసాంకా 33 బంతుల్లో 62, రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేశారు.