మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ యునానీ మందు ‘జిందా తిలిస్మాత్’ గురువారం పెద్దల సభలో మారు మోగింది. రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ప్రతి పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ‘జిందా తిలిస్మాత్’ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ ఔషదం ‘జిందా తిలిస్మాత్’ను స ర్వరోగ నివారణిగా ప్రాచుర్యం పొందిందని వివరించారు. అచ్చంగా ఆ మందు మాదిరిగానే పార్లమెంట్‌లో ఏ సమస్య వచ్చినా బిజెపి ప్రభుత్వం జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపుతుందని ఖర్గే ఎద్దేవా చేశారు. ఈ సందర్భాంగా హైదరాబాద్‌లో ‘జిందా తిలిస్మాత్’ అనే ప్రసిద్ధి మందు ఒకటి ఉంటుందనిఅన్నారు. ఏ రోగాన్నిఅయినా తగ్గిస్తుందని పేరు రావడపంతో సర్వరోగ నివారిణిగా దానికి పేరు వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఏ అంశంపైనా అయినా సమస్య ఏదైనా ఈ ఇద్దరుమంత్రులనే రంగంలోకి దింపుతుందనిమల్లికార్జున్ ఖర్గే చమత్కరించారు.

హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధ యునానీ మందు

జిందా తిలిస్మాత్ హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధ యునానీ మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరం.. ఇలా దేనికైనా పని చేయడంతో దీనికి సర్వరోగ నివారిణిగా పేరు గాంచింది. వందేండ్ల కిందట ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది హైదరాబాద్ కు చెందిన హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. ఇయన పేరు చివరన ఉండే ‘ఫారూఖీ మంజన్’ పేరు పళ్ల పొడి కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఔషధం మారుమూల పల్లెటూర్లు మొదలుకొని ప్రముఖ షాపింగ్ మాల్స్, మెడికల్ షాప్స్ వరకు ఎక్కడైనా దొరుకుతుంది.

రోగుల విశ్వాసాన్ని అమితంగా చూరగొన్న ఈ మందు ఆ తర్వాత ఒక బ్రాండ్‌గా మారి కార్ఖానా జిందాతిలిస్మాత్ పేరుతో పెద్ద కంపెనీగా అవతరించింది. మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ కుమారుడు మహ్మద్ ఓవైసుద్దీన్ ప్రస్తుతం ఈ కంపెనీని నడుపుతున్నాడు. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్, యూఎస్, యూకే, అరబ్ దేశాలలో ప్రముఖ మెడికల్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో ఉండటం విశేషం. హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరు ఉందో జిందా తిలిస్మాత్‌కు కూడా అంతే పేరు ఉంది. రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావించడంతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది.