
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను వేగవంతం చేయడం, మెట్రో రైలు రెండో దశ విస్తరణతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా రాబట్టడం వల్ల తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని ఆయన వివరించారు. అమెరికాలోని తెలుగు ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సిఎం పిలుపునిచ్చారు.
అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసి) ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలకు ఆయన వివరించారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కాలే యాదయ్య, దొంతి మాధవరెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.











