
ప్రభుత్వ సేవలకు ఇక ఒకే సర్టిఫికెట్
రేషన్ కార్డు డేటా ఆధారంగా రిజిస్టర్‌ను నిర్వహించనున్న ప్రభుత్వం
మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ సేవలకు అవసరమైన కుటుంబ సభ్యుల వివరాల కోసం వేర్వేరు ధృవపత్రాలను సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ నూతన విధానం ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) డాటాబేస్‌తో అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్టర్‌ను నిర్వహిస్తారు. రేషన్ కార్డు సంఖ్యనే కుటుంబ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు.
ఇందులో కుటుంబ పెద్ద పేరు, సభ్యుల వివరాలు, వయసు, చిరునామా వంటి అంశాలు నమోదై ఉంటాయి. పౌరులు మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలోని వయోజన సభ్యులలో ఎవరైనా ఈ దరఖాస్తును సమర్పించవచ్చు. దరఖాస్తుదారుడి వివరాలను రేషన్ కార్డు డాటాతో తహసీల్దార్ పరిశీలించిన అనంతరం, రెండు రోజుల్లో డిజిటల్ సంతకంతో కూడిన ధృవపత్రాన్ని జారీ చేస్తారు. అయితే, ఈ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాలు ధృవీకరణకు మాత్రమేనని, దీని ద్వారా ఆస్తి హక్కులు, చట్టపరమైన వారసత్వం లేదా ప్రభుత్వ పథకాలకు నేరుగా అర్హత లభించదని అధికారులు స్పష్టం చేశారు.








