
రోహిణి కార్తె రాకముందే రాష్ట్రంలో సూర్యుడు మంటెక్కిస్తున్నాడు. వడ గాలులు తీవ్రతతో ఎండ వేడిమి తారా స్థాయి చేరుకుంది. అనేక ప్రాంతాల్లో గత పది రోజులుగా 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. ఆదివారం భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం రాష్ట్రంలోని విచిత్ర వాతావరణ పరిస్థితికి అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, తరువాత క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురం భీం ఆసిఫాబాద్,
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా, సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 45.8 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 45.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 45.4, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 45.3, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దనోరాలో 45.2, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వెల్లడించింది.











