రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు వరుసబెట్టి జరుగుతున్నాయి. అర్రులు తెరుకొని చూస్తున్న రహదారులు మనుషుల ప్రాణాలను బావురుమని మింగేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలు గురువారం సాయంత్రం వరకు జరిగిన రెండే వేర్వురు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగు రు వ్యక్తులు దుర్మరణం చెందారుం. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల వంతెన సమీపంలోని జాతీయ రహదారిపై టైరు మారుస్తున్న గూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి దేవరుప్పుల గ్రామానికి కిరాణా సరుకులతో వెళ్తున్న

అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని వరంగల్ వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను దేవరుప్పుల గ్రామానికి చెందిన ఝాట్ రోహిత్ (22), దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన దోనికేని రాజేందర్ (27), గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన అశోక్ లేలాండ్ డ్రైవర్ నానుబాల మహేష్ (22)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.


ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారి మురహరిపల్లి సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రెజ్జా కారు (టీఎస్ 08 జేఎల్ 8300), కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ (టీజీ 05 టీ 9635) ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బ్రెజ్జా కారును నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రేఖ, కుమారుడు లోహిత్ (7), రేఖ సోదరి కుమారుడు నిహాల్ (2)లను స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎముకలకు తీవ్ర గాయాలైన లోహిత్‌కు చికిత్స కొనసాగుతోంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.