
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలకు సంబంధించి కేసులో 23 ఏళ్ల భారత వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు కలకత్తా హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో పోరెల్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. బాధితురాలు గోప్యతను కాపాడేందుకు, పోరెల్ కు చెందిన అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేసింది.
కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పోరెల్‌పై... పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అలాగే జూన్ 2026లో ఆమెపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో హుగ్లీ జిల్లాలోని మగ్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను బయటపెడతానని పోరెల్ బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన పోరెల్.. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ పోరెల్ కెరీర్
అభిషేక్ పోరెల్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున గత నాలుగు సీజన్లలో పోరెల్ మొత్తం 35 మ్యాచ్‌లు ఆడి, 25.63 సగటుతో 769 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌తో పాటు 32 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 23 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో 1408, 833 పరుగులు చేశాడు. బెంగాల్ జట్టుకు ప్రధాన వికెట్ కీపర్‌గా అభిషేక్ పోరెల్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.











