జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు, పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు శుక్రవారం జూలై 31 స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ సెలవుకు బదులుగా ఆగస్టు 8 రెండో శనివారం అన్ని విద్యాసంస్థలు సాధారణంగా పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.