
హైదరాబాద్: తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, బిఆర్ఎస్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోందని, పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చురకలంటించారు. మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలని సూచించారు. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారని, కురచ బుద్ధితో బిఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యమని మండిపడ్డారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజలు ఏమనుకుంటారన్న సోయి లేకుండా ఇంత పిచ్చి అబద్ధంగా మాట్లాడొచ్చ అని హరీష్ రావు అన్నారు.
నిజంగానే ఒప్పందం ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టైనా ఎందుకు తవ్వలేదు అని, ఈ రెండున్నరేళ్లుగా డ్రామాలు చేస్తూ పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదని, 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపారని, ఆరోజు మహారాష్ట్ర సిఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారని, మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని, ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయని, కాంగ్రెస్ ఏ పని చేసినా అది వృథా అవుతుంది అని స్పష్టంగా చెప్పారు .కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అగ్రిమెంట్ అయిపోయిందని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయి ఉంటే తమ్మిడిహట్టి దగ్గర పనులు ప్రారంభించకుండా తోక పనులను ఎందుకు ప్రారంభించారు? చేవెళ్ల దగ్గర ఎందుకు తవ్వారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. తాము మంత్రులం ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అతి విశ్వాసంతో వాళ్లు మాట్లాడుతున్నట్లుందని, తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని, కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఆయన తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారని చురకలంటించారు. మొన్న హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్ల బ్యారేజ్ కి నీళ్లు తెస్తాం అంటుున్నారని, సిఎం రేవంత్ రెడ్డి ఏమో తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి లిఫ్టుతో నీళ్లు తెస్తామంటున్నారని, మంత్రి జూపల్లి ఏమో లిఫ్ట్ అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయి అంటున్నారని, ఎవరు చెప్పేది నిజం అని అడిగారు. ఈ అజ్ఞానపు మాటలతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.
150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పించాలని మొన్న సీఎం అంటున్నారని, మరి 150 మీటర్లకు అప్పుడే అగ్రిమెంట్ జరిగిందని మంత్రి వివేక్ అంటున్నారని, అగ్రిమెంట్ జరిగి ఉంటే మళ్లీ మహారాష్ట్రను ఒప్పించడం ఎందుకు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి పట్టవు అని, పక్క రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వారితో చర్చించి, మెప్పించి మన ప్రయోజనాలు కాపాడుకోవాలని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే తీరుతో కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు.
2014లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కెసిఆర్ నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా తాను, అధికారులు మహారాష్ట్రకెళ్లి అక్కడి సిఎంను కలిసి విజ్ఞప్తి చేశామని, కెసిఆర్ తన పుట్టినరోజు నాడే రాష్ట్ర ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని, ఒక రాష్ట్రాన్ని ఒప్పించే పద్ధతి ఇదా? అని అడిగారు. తమ్మిడిహట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్ ఉందని, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉందని, సుప్రీంకోర్టు తీర్పు రావాలని, సాధకబాధకాలు తీర్చకుండానే మేనిఫెస్టోలో పెట్టి డైలాగులు కొట్టడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు అని హరీష్ రావు మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2024-25 బడ్జెట్లో పెట్టింది 2 కోట్లు అని, 2025లో 30 కోట్లు, ఈ ఏడాది 50 కోట్లు. మొత్తం 82 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు మాటల కోసమే తప్ప చేతల కోసం కాదు అని, కాంగ్రెసోళ్లకు చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో ఎందుకు సరైన నిధులు కేటాయించలేదు అని నిలదీశారు.
ఆ రోజు ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఏపీలో మూడు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్లను కట్టకుండా సమయం వృధా చేశారని, నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మాట ఇచ్చి ఏడున్నరేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా కనీస సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ. 2300 కోట్లు బిల్లులు లేపారని, కరప్షన్ అనేది కాంగ్రెస్ డిఎన్ఎ లోనే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల పనులకు, ల్యాండ్ అక్విజిషన్ కు ఖర్చు చేసింది రూ. 3780 కోట్లు. కానీ నిన్న రేవంత్ రెడ్డి 11 వేల కోట్లు పూర్తయ్యాయి అని పచ్చి అబద్ధం చెబుతున్నారని, తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖలోని అన్ని విభాగాలు చెప్పాయని గుర్తు చేశారు. ఆనాటి కేంద్ర మంత్రి ఉమాభారతి రాసిన లేఖలో మూడో పేజీలో ఉన్న నీళ్లు లేవు అన్న విషయాన్ని దాచిపెట్టి సగం లేఖను మాత్రమే చూపిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.
ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవెళ్లకు శంకుస్థాపన చేస్తే అది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదే ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతున్నారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఒక్కో పార్టీలో ఒక్కో మాట మాట్లాడటం ఆయన నైజమని ధ్వజమెత్తారు. ఈ మండుటెండల్లో నిమిషానికి మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయని, కానీ తమ్మిడిహట్టి వద్ద కేవలం 2000 క్యూసెక్కులు మాత్రమే పోతున్నాయని, 2 వేలు ఎక్కడ? 6400 క్యూసెక్కులు ఎక్కడ? అని చురకలంటించారు. మేడిగడ్డ వద్ద 500 బోర్లు వేయాల్సి ఉంటే మీరు కనీసం 5 బోర్లు కూడా వేయలేదని, ఆ రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కెసిఆర్ ఎక్కడ పేరు వస్తుందో అన్న అక్కసుతోనే పనులు ఆపుతున్నారని హరీష్ రావు విమర్శించారు. వచ్చే సంవత్సరం ఎల్ నినో వల్ల దేశమంతా కరువు వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారని, కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని, ఎంత కరువొచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే స్థలం మేడిగడ్డ అని తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ ముందు చూపుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంజనీర్లతో చర్చించి ఈ ప్రాజెక్టు కట్టారని, కాళేశ్వరాన్ని తక్కువ చేసి మాట్లాడితే, అది కెసిఆర్ తక్కువ చేసినట్లు కాదు అని, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జాతికి కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం అని దుయ్యబట్టారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేయకండని, కాళేశ్వరాన్ని కించపరిస్తే అందులో కొలువైన ముక్తేశ్వరుడు కాంగ్రెసోళ్లకు కచ్చితంగా శిక్ష వేస్తారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తమ్మిడిహట్టి జలహారతుల డ్రామాలు కట్టిపెట్టాలని, వెంటనే మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.














