మనతెలంగాణ/హైదరాబాద్ : రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని, కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆ పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పోవాలి...కెసిఆర్ రావాలి అనేది ప్రజల్లో వస్తున్న డిమాండ్ అని, దానిని ఎవరూ ఆపలేదని అన్నారు. ఆర్ధిక వెనుకబాటు తనంలో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు.

ఇంటర్ నుండి పోస్ట్ మెట్రిక్ చదివే వారికి లక్షలాది మంది విద్యార్థులకు బోధన కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పథకం మరింత పటిష్టంగా అమలు చేశారని అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కోర్సు పూర్తయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. చివరికి కళాశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. బకాయిలు వసూలు కోసం యాజమాన్యలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి నిధులు విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. జిఒ 7ను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.

గతంలో మాదిరిగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయాలని అన్నారు. నిరుపేద వర్గాలు అంటే రేవంత్‌రెడ్డికి ఎందుకు కక్ష..? అని ప్రశ్నించారు. రాజ్యంగ నిబంధనలు పాటించడం సిఎం బాధ్యత అని, విద్యా,వైద్యం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. వైద్య రంగానికి సంబంధించి కెసిఆర్ ఆరోగ్య శ్రీ మరింత పటిష్టం చేశారని చెప్పారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో వైద్య విద్యా కళాశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. కెసిఆర్ ఏర్పాటు చేసిన టిమ్స్ హాస్పిటల్స్, త్వరలో అందుబాటులోకి రానున్నాయని అన్నారు. గత పాలన కంటే మెరుగైన పాలన కొనసాగించాలని.. కానీ, రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదని పేర్కొన్నారు.