మన తెలంగాణ/హైదరాబాద్: రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని, కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బటన్ నొక్కడానికి బాధేంటని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అభాసుపాలు అయ్యిందని ఆయన ఎద్దేవా చే శారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఆయన అన్నా రు. 70 వేల ఉద్యోగాలపై తాను చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము రేవంత్ ఉందా అని ఆ యన ప్రశ్నించారు. కెటిఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీలో బాన్సువాడ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మం త్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సం దర్భంగా జరిగిన సమావేశంలో కెటిఆర్ మా ట్లాడుతూ గాచారం బాగాలేక పోచారం కాంగ్రె స్ అనే మునిగే పడవ ఎక్కారని, పోచారం శ్రీనివాస్ రెడ్డికి వెంకన్న స్వామి శాపం తప్పదని కెటిఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కెటిఆర్ అన్నారు.

రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుంది

రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని, ఎల్ నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏమిటీ? రైతులు ఇప్పటికే నష్టపోయారన్నారు. ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని, వ్యవసాయంపై అవగాహన లేదని విమర్శించారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని కెటిఆర్ ఆరోపించారు. రెండేళ్లు దాటినా 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కెసిఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ అనేది అసలు ఉండే పార్టీయా? భవిష్యత్ ఉన్న పార్టీయా? అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. గాచారం బాగాలేక పోచారం కాంగ్రెస్ అనే మునిగే పడవ ఎక్కారని, ఇప్పుడు మింగలేక కక్కలేక,

కుడితిలో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టుకునే పరిస్థితికి చేరుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వయసులో ఆ పెద్ద మనిషికి ఇంత అవస్థ అవసరమా? అని ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకు శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇవాళ తాను ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని కెటిఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడించడమే బిఆర్‌ఎస్ కార్యకర్తల లక్ష్యంగా ఉండాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన బాన్సువాడ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వచ్చి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని కెటిఆర్ గుర్తు చేశారు. ఆ సందర్భంగా దేవుడి మీద ఒట్టేసి నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మీతోనే ఉంటానని చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని కెటిఆర్ ఆరోపించారు. దేవుడి మీద రేవంత్ రెడ్డి ఒక్కరే ఒట్టు పెట్టి మోసం చేస్తాడనుకున్నామని, కానీ, పోచారం కూడా మోసం చేశారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కెటికేటీఆర్ ఆరోపించారు. ‘నిజాంసాగర్ సామర్థ్యం 17 టిఎంసీలు. కేవలం రెండు రోజులు మోటార్లు నడిపితే ప్రాజెక్టు నిండిపోతుందని, కానీ, ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని కెటిఆర్ ఆరోపించారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు దెబ్బతిన్నాయని, కానీ, మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. 31 నెలలు గడిచినా రెండు పిల్లర్లను బాగు చేయలేరా? మేస్త్రీలు దొరకలేదా? సిమెంట్ దొరకలేదా? ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం పేరుతో అబద్ధాలు చెబుతోందని కెటిఆర్ విమర్శించారు. బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా రైతులకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వ కంగా నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతోందని కెటిఆర్ ఆరోపించారు.