
టీం ఇండియా తరఫున ఎన్నో మరపురాని ప్రదర్శనలు చేసిన అజింక్యా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు భవిష్యత్తులో మరింత ఆనందంగా ఉండాలని పలువురు క్రికెటర్లు.. అభిమానులు కోరుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీం ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సందర్భంగా రహానేపై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘‘మేమిద్దరం చాలా ఏళ్లు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాం. రహానే ఎంత శ్రమిస్తాడో నాకు తెలుసు. నువ్వు సాధించిన ఘనతలు అద్భుతంగా నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం ప్రత్యేకమైనది. వండర్‌ఫుల్ కెరీర్‌కు కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్’’ అంటూ రోహిత్ పోస్ట్ చేశాడు.
ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేను అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు. ‘‘అజ్జు భాయ్.. నీతోపాటు మైదానం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతో గౌరవం. ప్రశాంతంగా ఉండే తీరు, ఆటపట్ల నిబద్ధత అద్భుతం. నిరంతరం మాకు స్పూర్తిగా నిలిచావు. సెండ్ ఇన్నింగ్స్ మరింత సంతోషకరంగా ఉండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని సూర్య పేర్కొన్నాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా రహానే గురించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘మనం ముంబయి జట్టు తరఫున తొలిసారి బ్యాటింగ్ చేసినప్పుడు.. అవకాశాల కోసం ఎన్నడూ వెంటపడని ఒకరిని నేను అప్పుడే చూశా. జట్టుకోసం కష్టపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నందువల్లే అవకాశాలు నీ దగ్గరికే వచ్చేవి. ఆ లక్షణం ఆస్ట్రేలియాలో నీ అత్యుత్తమ క్షణాలను తీసుకొచ్చింది. సంయమనం అనేది దూకుడుకు వ్యతిరేకం కాదని నిరూపించావు. కంగ్రాట్స్ రహానే’’ అని సచిన్ అన్నారు.











