కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో భవిష్యత్తులో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, యువతను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, బ్లూ కాలర్ ఉద్యోగాలు, విద్యా సంస్కరణలు మరియు క్రీడా మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీష్‌తో పాటు జర్మన్, జపనీస్ భాషల్లో కూడా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని, యువత సామర్థ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. 2026-27 బడ్జెట్‌లో విద్యకు ₹26,600 కోట్లు, అంటే 8.5 శాతం కేటాయించామని, ఇది ఖర్చు కాదు భవిష్యత్ తరాలపై పెట్టుబడి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.














