న్యూఢిల్లీ: నీట్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనను బహిరంగంగా సమర్ధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు చేపట్టిన ధర్నాను విమర్శించింది. బీజేపీ ప్రభుత్వంతో జుగల్ బందీగా దీనిని అభివర్ణించింది. సీజేపీ ఆందోళనను రాహుల్ గాంధీ బలహీనపరుస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, నెలరోజులుగా సీజేపీ, సోనమ్ వాంగ్‌చుక్ నిరసనలు తెలుపుతున్నా మాట్లాడేందుకు నిరాకరించిన ప్రధాని మోదీ రాహుల్‌ను మాత్రం తన నివాసం వద్ద ధర్మాకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇది జరిగిన గంటలోనే మోదీ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడటం తమకు ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

సీజేపీ నిరసనను బలహీనపరచేందుకే తన ఇంటి ముందు ధర్నాకు రాహుల్‌ను మోదీ అనుమతించారని ఆప్ మరో నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ సైతం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. నీట్ లీక్‌పై జరుగుతున్న ఉద్యమంపై కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు సీజేపీ నిరసనను బలహీనపరచే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీనికి ముందు, ప్రధానమంత్రి లోక్‌కల్యాణ్ మార్గ్ రెసిడెన్స్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు బైఠాయింపు ధర్నా జరిపారు. సుమారు 20 నిమిషాల తర్వాత పీఎంఓ కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్‌ను కలిసి ధర్నా విరమించాలని కోరారు. అందుకు రాహుల్ నిరాకరించారు. అనంతరం కాంగ్రెస్ నేతలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.