
బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి మూలాధారం డిపాజిట్లు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత వారి వారి జీవితకాల పొదుపులను ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉంచే సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్ అనేది కేవలం పెట్టుబడి కాదు, అది వారి జీవన ఆధారం. ఇటువంటి నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు పూర్తి బీమా రక్షణ కల్పించాలన్న ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చ కు దారితీసింది. దేశంలోని కొన్ని వర్గాల బ్యాంకు డిపాజిట్లపై, అంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, చిన్న డిపాజిటర్లకు పూర్తి బీమా రక్షణ కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు ప్రతిపాదనపై ఆ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇటీవల జైపూర్ లో జరిగిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రతిపాదన చేశారు. అదే సమావేశంలో మరో డిప్యూటీ గవర్నర్ జె. స్వామినాథన్ మాట్లాడుతూ డిపాజిట్ బీమాకు రిస్క్ ఆధారిత ప్రీమియం విధానాన్ని అమలు చేయాలన్న సూచన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఒకే రకమైన ప్రీమియం చెల్లిస్తుండగా, రిస్క్ ఎక్కువగా ఉన్న బ్యాంకులు ఎక్కువ ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావాలన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. అయితే అన్ని డిపాజిట్లకు పూర్తి బీమా కల్పించడం సరైన పరిష్కారం కూడా కాకపోవచ్చు అని ఆయన తెలిపారు. దీనివల్ల బ్యాంకులు అధిక ప్రమాదకర విధానాలను నివారించే ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. బీమా పరిమితి పెంపు సహకార బ్యాంకుల వైఫల్యాల నేపథ్యంలో ప్రతిపాదించినట్లుగా ఉంది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే. డిపాజిట్ బీమా అమలులోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 1993లో ఆనాటి రూపాయి మారకం విలువ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లక్ష రూపాయల వరకే బీమా రక్షణగా నిర్ణయించారు. అనంతరం కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై వచ్చిన విపరీతమైన ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మూడు దశాబ్దాల అనంతరం 2022లో ఐదు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. డిఐసిజిసి ద్వారా ఒక్కో డిపాజిటర్‌కు ఒక్కో బ్యాంకులో గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే బీమా రక్షణ ఉంది. ఏదైనా ఒక బ్యాంకు సంక్షోభంలోకి వెళితే, 5 లక్షల రూపాయలు పైబడిన డిపాజిట్లకు ఎటువంటి భద్రత లేదు. గత రెండు దశాబ్దాలలో అనేక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్థిక అవకతవకలు, నిర్వహణ లోపం, అధిక రుణాల మంజూరు, నియంత్రణలో లోపాల వంటి కారణాలతో సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో- ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంకు కుప్పకూలిన సంఘటనలో వేలాది మంది డిపాజిటర్లు తమ జీవితకాల పొదుపులను తిరిగి పొందేందుకు నెలల తరబడి, కొన్ని సార్లు సంవత్సరాలపాటు వేచి చూడాల్సి వచ్చింది. వైద్య ఖర్చులతో పాటుగా కుటుంబ అవసరాలకు కూడా తీసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే మాధవపుర మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంకు, సికెపి కో ఆపరేటివ్ బ్యాంక్, రూప కో ఆపరేటివ్ బ్యాంక్, సీర్మౌర్ అర్బన్ కో-ఆపరేటివ్ వంటి పలు సహకార బ్యాంకులు కూడా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐదు లక్షల బీమా పరిమితిని పెంచడం జరిగింది. అయినప్పటికీ పదవీ విరమణ అనంతరం తమ మొత్తం పొదుపులను ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టే సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి ఇప్పటికీ సరిపోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. దేశంలోని మొత్తం ఫిక్సెడ్ డిపాజిట్లలో దాదాపు 40 శాతం సీనియర్ సిటిజన్లకు సంబంధించినవి కావడం పెద్ద విశేషం. దీనివల్లనే ఈ అంశానికి మరింత ప్రాధాన్యత దక్కింది.
దీనివల్లనే సీనియర్ సిటిజన్ల జీవితకాల పొదుపులకు పూర్తి రక్షణ లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది. సీనియర్ సిటిజన్లకు భద్రత కల్పించడం ఒకవైపు అవసరమే అయితే, మరోవైపు బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చూసే కఠిన నియంత్రణ వ్యవస్థ కూడా అంతే ముఖ్యమైనది. సమర్థవంతమైన పర్యవేక్షణ, తప్పు చేసిన బ్యాంకుల యాజమాన్యాలపై వేగవంతమైన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో సహకార బ్యాంకుల వైఫల్యాల ప్రభావం డిపాజిటర్లపై తగ్గుతుంది. ఏదేమైనా, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక బీమా పథకం రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డిపాజిట్ బీమా పరిమితిని ద్రవ్యోల్బణంకు అనుగుణంగా తరచూ సమీక్షించాలి. సహకార బ్యాంకుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలి. సమస్యల్లో ఉన్న బ్యాంకులపై ముందస్తు చర్యలు తీసుకునే వ్యవస్థలను బలోపేతం చేయాలి. తరచూ బ్యాంకుల్లో తనిఖీలు జరిగేలా ఆడిటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. డిపాజిటర్లకు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పారదర్శక సమాచారం అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం బీమా పెంపు ప్రతిపాదన కార్యరూపం దాల్చితేనే బ్యాంకింగ్ వ్యవస్థపై సీనియర్ సిటిజన్లకు విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే 47% ఉన్నవారి డిపాజిట్లు ఈ రంగం అభివృద్ధికి ఎంతో అవసరం. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధి కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు.
గోపాలుని రాధాకృష్ణ
98853 90232











