
ఐఐటికె కొత్తగా ప్రారంభించిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం లభించని ఓ విద్యార్థి ఆ సంస్థల వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసిన సంఘటన జరిగింది. ఆ వెబ్‌సైట్‌లో విద్యార్థి “నాకు కావలసిందల్లా నాకు న్యాయమైన అవకాశం.”పేర్కొన్నాడు. సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తిరస్కరించిన తరువాత తాను కాన్పూర్, మద్రాస్ ఐఐటిల వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్టు వివరించాడు. ఇది హానికలిగించడానికి కాదని, తన సామర్ధాన్ని ప్రదర్శించడానికే అని చెబుతూ చొరబాటుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఎక్స్, రెడ్డిట్‌ల్లో పంచుకున్నాడు. అతను దరఖాస్తు సమర్పించి, ఫీజును చెల్లించి, అవసరమైన అన్నిపత్రాలను సమర్పించినా తనకు అవకాశం కల్పించలేదని,ప్రవేశ ప్రక్రియలో భాగమైన హ్యాకథాన్‌లో కూడా నిరాకరించారని ఆరోపించాడు.
అయితే సైబర్ సెక్యూరిటీలో ఆ విద్యార్థికి అనుభవం లేనందునే అతనిని షార్ట్‌లిస్టు చేయలేదని ఐఐటికె డైరెక్టర్ మునీంద్ర అగర్వాల్ వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ముగిసినందున ఇప్పుడు ప్రవేశం కుదరదన్నారు. అయినప్పటికీ ఆ విద్యార్థిని ఆహ్వానించి అతని సాంకేతిక నైపుణ్యాలను పరీక్షిస్తామని, సామర్థాన్ని నిరూపించుకుంటే తదుపరి ప్రవేశ ప్రక్రియలో అవకాశం కల్పిస్తామన్నారు. ఆ విద్యార్థిపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నామని, కానీ విద్యార్థి వాదనలను ధృవీకరించుకుని అతని సాంకేతిక సామర్థాన్ని అంచనా వేయాలని నిర్ణయించుకున్నామని ఐఐటి కె అధికారి ఒకరు వెల్లడించారు.











