మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం జిల్లా గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు.

నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.