
న్యూఢిల్లీ: భారతీయ శిక్షాసృ్మతి (ఐపీసీ)లోని సెక్షన్ 498ఏ పరిధిని విస్తరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు భర్త లేదా అతని బంధువుల క్రూరత్వానికి సంబంధించిన ఈ నిబంధన, ఇకపై వివాహ స్వభావం కలిగిన సహజీవన (లైవ్-ఇన్) సంబంధాల్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్. కోటిశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివాహ స్వభావం కలిగిన సహజీవన సంబంధంలో ఉన్న మహిళపై పురుషుడు క్రూరత్వానికి పాల్పడితే, అతనిపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టవచ్చని పేర్కొంది. సెక్షన్ 498ఏలో పేర్కొన్న రక్షణలు, వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడిన, వివాహాన్ని పోలిన సహజీవన సంబంధాలకు మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న సంబంధాలకే ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఈ విసృ్తత వ్యాఖ్యానం కేవలం సెక్షన్ 498ఏకే పరిమితమని, ఐపీసీలోని ఇతర నిబంధనలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అయితే, ఇలాంటి కేసుల్లో అరెస్టులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివాహ స్వభావం కలిగిన సహజీవన సంబంధంలో ఉన్న వ్యక్తి లేదా అతని బంధువులపై మహిళ క్రూరత్వం ఆరోపణలు చేసిన వెంటనే అరెస్టు చేయకుండా, ముందస్తు విచారణ అనంతరమే తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఏ వ్యక్తీ తనపై క్రూరత్వం జరుగుతుందని ముందుగానే ఊహించి బంధంలోకి ప్రవేశించరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి జంట తమ జీవితాన్ని ఆనందంగా సాగించాలనే ఆశయంతోనే కలిసి జీవించడం ప్రారంభిస్తుందని, అయితే కాలక్రమంలో కొన్ని సంబంధాలు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో బాధితులకు చట్టపరమైన రక్షణ కల్పించడం న్యాయవ్యవస్థ బాధ్యత అని తెలిపింది. సెక్షన్ 498ఏ కింద రక్షణ కల్పించే విషయంలో వివాహిత మహిళలకు, వివాహ స్వభావం కలిగిన సహజీవన సంబంధాల్లో ఉన్న మహిళలకు మధ్య తేడా చూపించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. గృహహింసను నిరోధించడమే ఈ నిబంధన లక్ష్యమని, అలాంటి సందర్భంలో ఈ రెండు వర్గాల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పొందుపరిచిన సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది. సహజీవన సంబంధంలో ఉన్న పురుషుడిపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయవచ్చా అనే ప్రశ్నపై విచారణ జరిపిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.











