
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓడిపోతారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి జోష్యం చెప్పారు. భవానీపూర్ నియోజకవర్గంలోని ఖిదిర్‌పూర్ ప్రాంతంలో ఉన్న రెండు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలింగ్ రోజున సాధారణంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చే మమతా బెనర్జీ ఈసారి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలను సందర్శించడంపై స్పందించిన సువేందు అధికారి, ఏది ఏమైనా సరే, ఆమె ఓడిపోతారు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.
ఇక పశ్చిమ బెంగాల్‌లో రెండో, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బ బర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఈ జిల్లాలు రాష్ట్ర రాజకీయ, ఎన్నికల పరంగా అత్యంత కీలక ప్రాంతాలుగా భావిస్తున్నారు. ప్రత్యేకించి దక్షిణ బెంగాల్‌లోని ఈ దశ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.
ఇది సంప్రదాయంగా తృణమూల్ కాంగ్రెస్ బలమైన ప్రాంతంగా ఉండగా, ఇక్కడ గట్టి పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఏప్రిల్ 23న జరిగిన తొలి దశ పోలింగ్‌లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 93.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.













