
గ్యాంగ్‌టక్: సిక్కిం నామ్చి జిల్లా లోని జోలుంగే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గంలో కొండచరియలు విరిగి పడడంతో ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. అక్కడ శిథిలాల తొలగింపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు వెల్లడించారు. ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ సొరంగంలో కొండచరియలు విరిగి పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రాజెక్టు అధికారులు, కార్మికులతోపాటు మొత్తం 25 మంది సొరంగంలో చిక్కుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
అకస్మాత్తుగ సోమవారం కొండచరియలు విరిగి పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 కి పది మృతదేహాలను వెలికి తీసినట్టు , వీరిలో ఏడుగురిని గుర్తించినట్టు ఇంకా గుర్తింపు కాని మూడు మృతదేహాలను జిల్లా ఆస్పత్రి సింగ్టమ్, ఎస్‌టిఎన్‌ఎం ఆస్పత్రికి పంపినట్టు జిల్లా అధికారులు వివరించారు. గుర్తించిన ఏడు మృతదేహాల్లో నాలుగు పశ్చిమబెంగాల్ జల్‌పాయ్‌కు చెందినవి కాగా, అస్సాం, పంజాబ్, ఉత్తరాఖండ్‌లకు చెందిన ఒక్కొక్క మృతదేహం ఉన్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం వెల్లడించారు.











