
ఇస్లామాబాద్ : సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణలో కెనడా సాయాన్ని పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ సోమవారం అభ్యర్థించారు. దార్ పాక్ విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో సంయుక్త పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈమేరకు విజ్ఞప్తి చేశారు. కెనడా మంత్రి అనితా ఆనంద్ పాక్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం 1960లో భారత్‌పాక్ మధ్య కుదిరింది.
సింధు నదీ లోయలోని ఆరు నదుల జలాల పంపకం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదుల జలాలు భారత్‌కు, పశ్చిమవైపున్న నదుల జలాలు పెద్దమొత్తంలో పాకిస్థాన్‌కు కేటాయింపు చేశారు. అయితే 2025లో పహల్గాం ఉగ్రదాడి వల్ల భారత్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ తగిన చర్యలు తీసుకునేవరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు భారత్ ప్రకటించింది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న భద్రతా పరిస్థితి లోకి కొత్త పరిమాణాన్ని భారత్ తీసుకు వచ్చిందని దార్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తమ మిత్రదేశాలైన కెనడా వంటి దేశాల మద్దతు తాము కోరుతున్నామన్నారు.











